- సిటీలో హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠా గుట్టురట్టు
- ముగ్గురు అరెస్ట్.. 5 ఫోన్లు స్వాధీనం: సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో మొబైల్ ఫోన్లను చోరీ చేసి, అందులోని యూపీఐ యాప్‌లను ఉపయోగించి డబ్బులు కాజేస్తున్న ముఠాలోని ముగ్గురిని సిటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సులు,పబ్లిక్‌ప్లేసుల్లో స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న వారిని గమనిస్తారు. వారి వెనుక నిలబడి.. స్క్రీన్ లాక్ (పాటర్న్ / పిన్ / పాస్‌వర్డ్) ఓపెన్ చేసే విధానాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత వారిని ఫాలో అయ్యి ఫోన్ కొట్టేస్తారు. ఒకవేళ చోరీ చేసిన సెల్ ఫోన్ పాస్‌వర్డ్ తెలియకపోతే.. ఫోన్ పోగొట్టుకున్న వారు తమ నంబర్‌కు కాల్ చేయగానే.. తాము కండక్టర్ లేదా డ్రైవర్ అని నమ్మిస్తారు. వివరాలు సరిచూడాలనే నెపంతో బాధితుల చేతనే స్క్రీన్ లాక్ పాస్‌వర్డ్ చెప్పించుకుంటున్నారు.
గ్యాలరీలో డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు వద్దు
ఫోన్ అన్‌లాక్ అవగానే నిందితులు గ్యాలరీ, నోట్స్, మెసేజ్‌లు, వాట్సాప్ చాట్‌లను పరిశీలిస్తారు. సాధారణ ప్రజలు గ్యాలరీలో భద్రపరుచుకునే డెబిట్, క్రెడిట్ కార్డుల ఫొటోలు, ఆధార్, పాన్ కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు, నోట్స్ యాప్‌లోని పిన్‌లను సేకరిస్తారు. చోరీ చేసిన సిమ్ కార్డు నేరగాళ్ల చేతిలోనే ఉండడంతో.. ఫోన్‌లోని ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్‌లను ఓపెన్ చేసి ఓటీపీల ద్వారా పాస్‌వర్డ్‌లను రీసెట్ చేస్తారు. క్షణాల వ్యవధిలో బాధితుల ఖాతాల నుంచి నగదును ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు మళ్లించి డ్రా చేసుకుంటున్నారు.
టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లను పెట్టుకుంటున్నరు
ముఠాలో ఫోన్లు చోరీ చేసేవారు, పిన్‌లు సేకరించేవారు, బ్యాంకింగ్ యాప్స్ హ్యాక్ చేసి నగదు బదిలీ చేసే టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లు వేర్వేరుగా పనిచేస్తున్నారు. ఫోన్ పోయిన వారికి ఎవరైనా ఫోన్ చేసి.. "మీ ఫోన్ నాకు దొరికింది, వివరాలు చెప్పండి" అంటే మాత్రం ఎవరికీ ఏ వివరాలూ చెప్పొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ స్క్రీన్ లాక్ పిన్, పాస్‌వర్డ్ లేదా బ్యాంకింగ్ ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఏటీఎం కార్డులు, ఆధార్, పాన్ కార్డుల ఫోటోలను ఎప్పుడూ మొబైల్ గ్యాలరీలో గానీ, నోట్స్ యాప్‌లో గానీ సేవ్ చేసుకోవద్దని స్పష్టం చేశారు.
ఫోన్ పోతే సిమ్ కార్డు బ్లాక్ చేయాలి
ఫోన్ పోయిన వెంటనే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ను సంప్రదించి సిమ్ కార్డును బ్లాక్ చేయించాలి. బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి యూపీఐ సేవలను ఫ్రీజ్ చేయించాలి. www.ceir.gov.in లో ఐఎంఈఐ నంబర్ నమోదు చేసి ఫోన్ ను బ్లాక్ చేయించాలి. డబ్బులు కట్ అయితే వెంటనే 1930 కు కాల్ చేయాలి. www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి. ఇండ్లలోని యువత తమ కుటుంబాల్లోని వృద్ధులకు ఈ నేరాల పట్ల అవగాహన కల్పించాలి.
- హైదరాబాద్ సీపీ సజ్జనార్
