- కొండా సుస్మిత వివాదాన్ని పరిష్కరించే బాధ్యత భట్టికి అప్పగించిన హైకమాండ్
- అందులో భాగంగానే ఈ సమావేశం జరిగిందంటున్న పార్టీ వర్గాలు
- నా బిడ్డ వ్యాఖ్యలు వ్యక్తిగతం.. ఆమె
- ప్లాన్ బీ ఏంటో తెలియదు: కొండా మురళి
- ఆంధ్రా మీడియా ఒళ్లు దగ్గర
- పెట్టుకోవాలి: రాజగోపాల్‌రెడ్డి
- బిల్లులు, నిధుల కోసమే భట్టిని కలిశామన్న ఇద్దరు నేతలు
హైదరాబాద్, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బుధవారం ప్రజా భవన్‌లో కొండా మురళి కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొనడం ఆసక్తి రేపుతున్నది. ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని హైకమాండ్‌కు సిఫార్సు చేసినట్లు తెలిసింది.
అయితే, ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను హైకమాండ్ భట్టికి అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇందులో భాగంగానే భట్టితో కొండా మురళి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ భేటీ సాగుతున్న సమయంలోనే మొదట కొండా మురళి, ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆ వెంటనే శ్రీధర్ బాబు భట్టి నివాసం నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. కానీ భట్టి, ఉత్తమ్ మాత్రం చాలా సేపు మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది.
అయితే, ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి మీడియాతో చెప్పారు. తన నియోజకవర్గానికి చెందిన పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడేందుకు భట్టిని కలిసినట్లు ఈ ఇద్దరు నేతలు పేర్కొన్నారు. కానీ సురేఖ, చిన్నారెడ్డిపై తుది నివేదికను పీసీసీ క్రమశిక్షణ కమిటీ హైకమాండ్‌కు పంపిన నేపథ్యంలో వీరి భేటీపై రాజకీయంగా ఊహగానాలు మొదలయ్యాయి. మొత్తానికి కొండా సురేఖ, చిన్నారెడ్డి విషయంలో త్వరలోనే హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకోనుందని, అందులో భాగంగానే ఈ భేటీ జరిగిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
నా బిడ్డ వివాదంతో నాకేం సంబంధం?: కొండా మురళి
భట్టితో భేటీ అనంతరం కొండా మురళి ప్రజా భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు. సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఆమెను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. దీనిపై మేం క్రమశిక్షణా కమిటీకి చెప్పాల్సింది వివరణ రూపంలో లిఖితపూర్వకంగా ఇచ్చాం. ప్రస్తుతం అధికారిక పనుల్లో భాగంగానే బిల్లుల గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశాను” అని అన్నారు.
‘‘నా బిడ్డ ‘ప్లాన్ -ఏ’లో అలా మాట్లాడింది. ‘ప్లాన్- బీ’లో ఏం చేస్తుందని ప్రశ్నిస్తే నాకేం తెలుస్తుంది. ఆ వివాదంతో నాకు సంబంధం లేదు’’ అని అన్నారు. 38 ఏళ్ల సుస్మితకు ఏమైనా మాట్లాడే హక్కు ఉందని.. ఆమెను నియంత్రించే, ప్రశ్నించే హక్కు తమకు లేదన్నారు. అట్ల అని ఆమె తమ కుటుంబ సభ్యురాలు కాకుండా పోదన్నారు. కవిత లాంటి వ్యక్తి బీఆర్‌ఎస్ నుంచి బయటకు వస్తే ఎవరైనా ప్రశ్నించారా? నా బిడ్డ విషయంలో ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.
సురేఖ తప్పించుకొని ఎక్కడికీ పారిపోలేదని, వరంగల్ జిల్లాలోనే తిరుగుతున్నారని చెప్పారు. సుస్మిత వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి చెప్పాల్సింది చెప్పామని, తమకు పూర్తి నమ్మకం ఉందని.. ఖచ్చితంగా తమకు అనుకూలమైన నిర్ణయం వస్తుందన్నారు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏమీ మాట్లాడనని ఆయన స్పష్టం చేశారు.
