అవయవాలు దొరక్క రాలుతున్న పసిమొగ్గలు..గడిచిన14 ఏండ్లలో 130 మంది మృతి

అవయవాలు దొరక్క  రాలుతున్న పసిమొగ్గలు..గడిచిన14 ఏండ్లలో 130 మంది మృతి
  • ఆర్గాన్స్ కోసం నమోదైన 300 మందిలో బతికింది 42 మందే 
  •     ఏటా పది మందికి పైగా చిన్నారులు కన్నుమూత
  •     ఇప్పటికీ అవయవాల కోసం ఎదురుచూస్తున్న 84 మంది పిల్లలు 
  •     పుట్టుకతో వచ్చే లోపాలతో క్షీణిస్తున్న కాలేయం, కిడ్నీలు, గుండె
  •     అవగాహన లేమి.. పెద్దల ఆర్గాన్స్ సరిపోక బలైపోతున్న పసి ప్రాణాలు
  •     నీలోఫర్‌‌లో రిట్రీవల్ సెంటర్ లేక మట్టిపాలవుతున్న అవయవాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవయవాలు దొరక్క పసిప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జీవన్ దాన్ ప్రారంభమైనప్పటి నుంచి గడిచిన 14 ఏళ్లలో ఆర్గాన్స్ కోసం 300 మంది చిన్నారులు పేర్లు నమోదు చేసుకోగా.. కేవలం 42 మందికి మాత్రమే అవయవాలు దొరికి ప్రాణం దక్కింది. తమ వంతు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూస్తూ ఏకంగా 130 మంది పసివాళ్లు కన్నుమూశారు. ప్రస్తుతం మరో 84 మంది చిన్నారులు ఆర్గాన్స్ కోసం వెంటిలేటర్లు, డయాలసిస్ బెడ్లపై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 2013, 2014లో ఒకటి, రెండుగా ఉన్న రిజిస్ట్రేషన్లు.. 2024 నాటికి 53కి, 2025 నాటికి 69కి, ఇప్పటిదాకా 38కి పెరిగాయి. ఇలా ఏటా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నా, ట్రాన్స్‌‌ప్లాంటేషన్లు మాత్రం ఏడాదికి ఒకటి, రెండుకు మించి జరగడం లేదు. ఫలితంగా ఏటా పది మందికి పైగా చిన్నారులు అవయవాలు అందక మృత్యువాత పడుతున్నారు.

వెయిటింగ్ స్టేజ్ లోనే కన్నుమూత 

చిన్నారుల్లో ఎక్కువ మంది పుట్టుకతో వచ్చే జన్యు లోపాలు, బైలియరీ అట్రేసియా వంటి కాలేయ సమస్యలు, గుండె జబ్బులు, ఇన్ఫెక్షన్ల వల్ల అవయవాలు పాడైపోతున్నాయి. లివర్ కోసం 186 మంది చిన్నారులు పేర్లు నమోదు చేసుకోగా.. కేవలం 18 మందికే ట్రాన్స్‌‌ప్లాంట్ జరిగింది. లివర్ దొరక్క ఏకంగా 86 మంది చనిపోగా, మరో 43 మంది లివర్ కోసం ఎదురుచూస్తున్నారు. కిడ్నీల కోసం 84 మంది నమోదైతే.. 17 మందికే ట్రాన్స్‌‌ప్లాంట్ జరిగింది. 31 మంది చనిపోగా..30 మంది ఆర్గాన్ కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. గుండె కోసం 18 మంది రిజిస్టర్ చేసుకోగా, నలుగురికే సర్జరీ అందింది. మరో నలుగురు నిరీక్షిస్తుండగా.. 10 మంది చనిపోయారు. ఊపిరితిత్తుల కోసం 12 మందిలో ముగ్గురు చనిపోగా, ముగ్గురికే సర్జరీ జరిగింది. చిన్న వయసులో రక్తనాళాలు సన్నగా ఉండటంతో రోజూ డయాలసిస్ చేయడం నరకంగా మారి కిడ్నీ రోగులు త్వరగా ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు తల్లిదండ్రులు అవయవాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నా... పెద్దల అవయవాలు పిల్లలకు సరిపోవడం లేదు.

నీలోఫర్‌‌లో  ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్ లేక..

రాష్ట్రంలో పిల్లల కోసం ఉన్న ఏకైక అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్. ఇక్కడి పీఐసీయూ, ఎన్‌‌ఐసీయూలలో నెలకు పదుల సంఖ్యలో చిన్నారులు బ్రెయిన్ డెత్ అవుతున్నా, ఇప్పటివరకు ఒక్క బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ కూడా చేయలేదు. నీలోఫర్‌‌కు అధికారిక ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్ గుర్తింపు లేకపోవడం, శాశ్వత బ్రెయిన్ డెత్ కమిటీ లేకపోవడంతో విలువైన అవయవాలు మట్టిపాలవుతున్నాయి. చట్టపరమైన చిక్కుల భయంతో డాక్టర్లు బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయడం లేదు. తల్లిదండ్రులను ఒప్పించే పీడియాట్రిక్ గ్రీఫ్ కౌన్సెలర్లు ఆసుపత్రులలో లేరు. ప్రభుత్వంలో పీడియాట్రిక్ మైక్రోవాస్కులర్ సర్జన్లు కొరవడటం, ప్రైవేటులో సర్జరీకి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుండటంతో పేదలు బిడ్డలను కాపాడుకోలేక చేతులెత్తేస్తున్నారు. మరోవైపు సిటీలో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా పీడియాట్రిక్ ఆర్గాన్ డొనేషన్లు, ట్రాన్స్‌‌ప్లాంట్లు అనుకున్న స్థాయిలో జరగకపోవడం గమనార్హం.

ఇతర రాష్ట్రాల్లో పిల్లల ఆర్గాన్ డొనేషన్ భేష్

తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లో ప్రభుత్వ పిల్లల ఆసుపత్రులకే నేరుగా రిట్రీవల్, ట్రాన్స్‌‌ప్లాంట్ అధికారాలిచ్చి, ఎన్‌‌జీవోలతో కౌన్సెలింగ్ ఇప్పిస్తూ, స్ప్లిట్-లివర్ సర్జరీలతో పసిప్రాణాలను నిలబెడుతున్నారు. తమిళనాడులో దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తూ అవగాహన పెంచారు. గుజరాత్‌‌లో ఎన్‌‌జీవోలు ఐసీయూలలో పనిచేస్తూ నెలల పసికందుల నుంచి కూడా అవయవాలు దానం చేయిస్తున్నారు. కేరళలో పది నెలల పాప అవయవదానం చేసి రికార్డు నెలకొల్పింది. కానీ పెద్దల అవయవదానాల్లో నంబర్ వన్ అని చెప్పుకునే మన దగ్గర మాత్రం పిల్లల విషయంలో చేతులెత్తేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక్క ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్ కూడా లేకపోవడం, ప్రభుత్వాలు పిల్లల ఆరోగ్యంపై చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని  తెలియజేస్తోంది.

సర్కారు మేల్కొంటేనే పసి ప్రాణాలు నిలిచేది... 

నీలోఫర్ హాస్పిటల్ ను వెంటనే పూర్తిస్థాయి ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్‌‌  మార్చి, 24 గంటలూ పనిచేసేలా బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ ప్యానెల్, జీవందాన్ కౌన్సెలర్లను నియమించాలనే అభిప్రాయాలు డాక్టర్లు, ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. నిమ్స్, ఉస్మానియా హాస్పిటల్స్ లో పిల్లల కోసం ప్రత్యేక ట్రాన్స్‌‌ ప్లాంట్ విభాగాలు పెట్టి పీడియాట్రిక్ సర్జన్లను రిక్రూట్ చేయాలి. ఆరోగ్యశ్రీ కింద సర్జరీ ఉచితంగా చేయడంతో పాటు, ఆపరేషన్ తర్వాత జీవితాంతం వాడాల్సిన ఖరీదైన ఇమ్యునోసప్రసెంట్ మందులను ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలి. పెద్దల లివర్‌‌ ను విభజించి పిల్లలకు అమర్చే స్ప్లిట్-లివర్ విధానాన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో తప్పనిసరి చేసి, పిల్లల అవయవాలు లభ్యమైనప్పుడు వెయిటింగ్ లిస్ట్‌‌ లోని పిల్లలకే మొదటి ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే ఈ పసిమొగ్గలకు పునర్జన్మ లభిస్తుందనే 
అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రభుత్వం మేల్కొంటేనే...

నీలోఫర్ ఆసుపత్రిని వెంటనే పూర్తిస్థాయి ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్‌‌గా మార్చి, 24 గంటలూ పనిచేసేలా బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ ప్యానెల్, జీవందాన్ కౌన్సెలర్లను నియమించాలనే అభిప్రాయాలు డాక్టర్లు, ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులలో పిల్లల కోసం ప్రత్యేక ట్రాన్స్‌‌ప్లాంట్ విభాగాలు ఏర్పాటు చేసి పీడియాట్రిక్ సర్జన్లను నియమించాలి. ఆరోగ్యశ్రీ కింద సర్జరీ ఉచితంగా చేయడంతో పాటు, ఆపరేషన్ తర్వాత జీవితాంతం వాడాల్సిన ఖరీదైన ఇమ్యునోసప్రసెంట్ మందులను ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలి. పెద్దల లివర్‌‌ను విభజించి పిల్లలకు అమర్చే స్ప్లిట్-లివర్ విధానాన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో తప్పనిసరి చేసి, పిల్లల అవయవాలు లభ్యమైనప్పుడు వెయిటింగ్ లిస్టులోని పిల్లలకే మొదటి ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే ఈ పసిమొగ్గలకు పునర్జన్మ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.