ఆమ్‌స్టెల్విన్: విమెన్స్ హాకీ వరల్డ్ కప్‌లో నిరాశపర్చిన ఇండియా వర్గీకరణ పోరుకు రెడీ అయ్యింది. గురువారం ఐదో స్థానం కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో ఇండియా.. మాజీ వరల్డ్ చాంపియన్ జర్మనీతో తలపడుతుంది. 1974 తొలి ఎడిషన్‌లో నాలుగో ప్లేస్ సాధించిన ఇండియా ఆ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో ఆడలేదు. ఒకవేళ ఐదో స్థానం సాధిస్తే టీమిండియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కానుంది. ఈ మ్యాచ్‌లో రాణించి ఆసియా క్రీడలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ క్రీడల్లో స్వర్ణం సాధిస్తే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు డైరెక్ట్‌గా అర్హత సాధించే అవకాశం ఉంది. కాబట్టి జర్మనీ మ్యాచ్‌తో పాటు ఆసియా క్రీడలపై కూడా తమ జట్టు దృష్టి పెట్టిందని చీఫ్ కోచ్ సోయెర్జ్ మారిన్ వెల్లడించాడు. సెమీస్ చేరలేదనే బాధ నుంచి టీమ్ ప్లేయర్లు పూర్తిగా కోలుకున్నారని, జర్మనీతో మ్యాచ్‌లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు వరల్డ్ కప్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఇండియాపై గెలవడం జర్మనీకి కలిసొచ్చే అంశం. పక్కా ప్రణాళికలతో వ్యూహాలను అమలు చేయాలని భావిస్తోంది.
