న్యూఢిల్లీ: ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) పాలనలో కీలక బాధ్యతలు నిర్వర్తించేందుకు టెన్నిస్ లెజెండ్స్ ముందుకొచ్చారు. ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ అవుట్‌స్టాండింగ్ మెరిట్ (ఎస్‌వోఎమ్) పోస్ట్‌ల కోసం సానియా మీర్జా, మహేశ్ భూపతి, రోహన్ బోపన్న దరఖాస్తు చేశారు.
నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ చట్టం నిబంధనల ప్రకారం ఏఐటీఏ ఈ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే లియాండ్ పేస్ బరిలో నిలిచాడు. మెన్స్ విభాగంలో 18, విమెన్స్‌లో 8తో కలిపి మొత్తం 26 దరఖాస్తులు వచ్చాయి.
డేవిస్ కప్ మాజీ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్, గౌరవ్ నాటేకర్, ముస్తఫా గౌస్, విశాల్ ఉప్పల్, సాయి జయలక్ష్మి, రాధిక కనిత్కర్, రుష్మి చక్రవర్తి కూడా రేసులో ఉన్నారు. నవంబర్ 5న ఎస్‌వోఎమ్ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. 27న ఏఐటీఏ నూతన కార్యవర్గ ఎన్నికలు జరగనున్నాయి.
కొత్త రూల్స్ ప్రకారం జనరల్ బాడీలో నలుగురు (ఇద్దరు మెన్స్, ఇద్దరు విమెన్స్), 15 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇద్దరు (ఒక మెన్, ఒక విమెన్) ఎస్‌వోఎమ్ ప్రతినిధులకు చోటు దక్కనుంది.
