రూ. 45.74 కోట్ల ధాన్యం పక్కదారి... కరీంనగర్ జిల్లాలో 16 మంది డీఫాల్టర్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు

రూ. 45.74 కోట్ల ధాన్యం పక్కదారి... కరీంనగర్ జిల్లాలో 16 మంది డీఫాల్టర్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో సివిల్ సప్లై కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కు చెందిన రూ.45.74 కోట్ల విలువైన ధాన్యాన్ని దారి మళ్లించిన ఎనిమిది మిల్లులకు చెందిన 16 మంది భాగస్వాములపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మిల్లింగ్ కోసం ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని, తిరిగి అప్పగించాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా అక్రమంగా విక్రయించినట్లు ఆఫీసర్లు గుర్తించారు. 

దీంతో సదరు మిల్లర్ల ఆస్తుల క్రయవిక్రయాలు, గిఫ్ట్ డీడ్ల బదలాయింపులను నిలిపివేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్, ఈవోఈడీ డి.శ్రీనివాస్ రెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లకు సమాచారం ఇచ్చారు. 

ఆస్తుల బదలాయింపుల నిలిపివేత..

జిల్లా సివిల్ సప్లై శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫీసర్లు మూడు నెలలుగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూశాయి. మిల్లుల్లో ఉండాల్సిన ప్రభుత్వ ధాన్యం, సీఎంఆర్ బియ్యం నిల్వలు మాయమైనట్లు, వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి సొంత లాభం కోసం విక్రయించినట్లు గుర్తించారు. 

నిబంధనల ప్రకారం 125 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీతో కలిపి 90 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని లేదా బియ్యం రూపంలో తిరిగి అప్పగించాలని ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆస్తుల బదలాయింపులను నిలిపివేయడంతోపాటు, ఆస్తుల జప్తు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా సివిల్ సప్లై శాఖ డీఎం రజనీకాంత్ ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్ స్టేషన్లలో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.