వర్తమాన విద్యార్థి పోరాటాలకు స్ఫూర్తి ‘లోక్‌‌నాయక్‌‌’

వర్తమాన విద్యార్థి పోరాటాలకు స్ఫూర్తి ‘లోక్‌‌నాయక్‌‌’

అందరూ ప్రేమగా పిలుచుకునే 'లోక్‌‌నాయక్' జయప్రకాశ్ నారాయణ్‌‌ది  భారత  ఆధునిక చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే అధికార రాజకీయాలకు అతీతంగా నిలిచి, వ్యవస్థలో నైతిక విలువలను  నిలబెట్టడానికి  పోరాడిన ఒక మహనీయుడి ప్రస్థానం కనిపిస్తుంది. 1902 అక్టోబర్ 11న  బిహార్‌‌లోని  సితాబ్‌‌దియారా అనే కుగ్రామంలో  జేపీ జన్మించారు.  ఆయనలో  దేశభక్తి భావాలు చాలా చిన్న వయసులోనే మొగ్గతొడిగాయి.

మహాత్మా గాంధీ  దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు, తన చదువును మధ్యలోనే వదిలిపెట్టి ఉద్యమ బాట పట్టడం ఆయనలోని  తెగువకు నిదర్శనం. సమాజంలో అసమానతలు తొలగిపోవాలంటే సోషలిజమే సరైన మార్గమని ఆయన గట్టిగా విశ్వసించారు.  జవహర్‌‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీలతో సన్నిహితంగా ఉంటూనే, కాంగ్రెస్‌‌లోనే ఉన్న యువతతో కలిసి 1934లో ‘కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ’ని  ఏర్పాటు చేశారు.

ప్రజాసేవకు అధికారమే లక్ష్యం కాకూడదు
1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం జేపీని దేశవ్యాప్తంగా ఒక వీరుడిగా నిలబెట్టింది.  ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో బ్రిటిష్ పాలకులు ఆయనను హజారీబాగ్ జైలులో బంధించారు. అయితే దీపావళి పండుగ రాత్రి,  చీకటి మాటున జైలు గోడలు దూకి తప్పించుకోవడం నాటి భారత యువతను ఉర్రూతలూగించింది.

స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత చాలామంది నాయకులు అధికార కుర్చీల కోసం పోటీపడితే, జేపీ మాత్రం నెహ్రూ ఆఫర్ చేసిన మంత్రి పదవులను సున్నితంగా తిరస్కరించారు. అధికారం అనేది ప్రజాసేవకు ఒక సాధనం మాత్రమే తప్ప, అదే అంతిమ లక్ష్యం కాకూడదని ఆయన నమ్మారు.

అందుకే ఆయన వినోబా భావే పిలుపుతో సర్వోదయ, భూదాన్ ఉద్యమాలలో చేరి, గ్రామాల్లో తిరిగి భూస్వాముల నుంచి పేదలకు భూమిని ఇప్పించే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాదు, మధ్యప్రదేశ్‌‌లోని చంబల్ లోయలో భయానక బందిపోట్లుగా ముద్రపడినవారి మనస్సులను మార్చి, వారు గాంధేయ మార్గంలో పోలీసుల ఎదుట లొంగిపోయేలా చేయడంలో జేపీ చూపిన చొరవ అసాధారణమైనది. ఆయన ఎప్పుడూ ఏ చట్టసభ సభ్యుడిగా లేరు, కానీ ప్రధానమంత్రులను సైతం ప్రశ్నించగలిగే అంతటి నైతిక శక్తిని సంపాదించుకున్నారు.

సంపూర్ణ క్రాంతి
1974లో బిహార్ విద్యార్థులు తమకు నాయకత్వం వహించమని జేపీని కోరినప్పుడు, ఆయన కేవలం ఒక షరతుపై అంగీకరించారు. ఉద్యమం నూటికి నూరు శాతం అహింసా మార్గంలోనే కొనసాగించాలని విద్యార్థులకు సూచించడంతోపాటు, ఆ క్షణమే ఆయన పాట్నాలోని గాంధీ మైదానంలో ‘సంపూర్ణ క్రాంతి’ (టోటల్ రెవెల్యూషన్) అనే సిద్ధాంతానికి పిలుపునిచ్చారు.

ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జేపీని అరెస్ట్ చేశారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత, విడివిడిగా ఉన్న ప్రతిపక్షాలను ఒకే తాటిపైకి తెచ్చి జనతా పార్టీ రూపకల్పన చేయడంలో జేపీదే కీలక పాత్ర. 1977లో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసి, భారత ప్రజాస్వామ్యం ఎంత బలీయమైనదో ప్రపంచానికి చాటిచెప్పారు.

ఇక వర్తమానంలో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులు చేసే ఆందోళనలు, పోరాటాలను పరిశీలిస్తే, జేపీ నాటి విద్యార్థి ఉద్యమాలకు, నేటి పరిస్థితులకు మధ్య స్పష్టమైన పోలికలు కనిపిస్తాయి.నాడు బిహార్‌‌లో విద్యార్థులు ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, విశ్వవిద్యాలయాల్లో ఫీజుల పెంపు, చదువు పూర్తయినా ఉద్యోగాలు దొరకని దయనీయ స్థితికి వ్యతిరేకంగా పోరాడారు.

ఈ రోజు దేశంలో విద్యార్థులు, యువత రోడ్లపైకి వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం పేపర్ లీకేజీలు, రిక్రూట్‌‌మెంట్లు ఆలస్యం కావడం, నిరుద్యోగం, ప్రైవేటీకరణ భారం వంటి అంశాలే. జయప్రకాశ్ నారాయణ్ చూపిన బాట ఏమిటంటే.. విద్యార్థి శక్తి అనేది రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మ కాకూడదు. అది స్వతంత్రంగా, నైతిక స్పృహతో వ్యవస్థను సవరించే ఒక దివ్య సాధనంగా ఉండాలి.  

డా. ఎ.శంకర్‌‌‌‌, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ

  • ఓపెన్​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ [email protected]
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.