- పరస్పర గౌరవంతోనే సత్సంబంధాలు
- ‘స్టాండ్ విత్ హర్’ చర్చా వేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: భార్య, మహిళల పట్ల కోపం, అహంకారం, ఆధిపత్య ధోరణులతో కూడిన పురుషాధిక్య భావజాలాన్ని ప్రతిఒక్కరూ మార్చుకోవాలని సీఐడీ, ఏసీబీ, విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా సూచించారు. ‘స్టాండ్ విత్ హర్’ ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని వీహబ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎనిమిదో చర్చా వేదిక నిర్వహించారు. ప్యానల్ డిస్కషన్స్‌లో నటి, యాంకర్ ఝాన్సీ, నటుడు వంశీ చాగంటి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చారుసిన్హా మాట్లాడుతూ పురుషులు, మహిళలు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటేనే సత్సంబంధాలు బాగుంటాయని తెలిపారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భావనను మనసులో నుంచి తీసేయాలని స్పష్టం చేశారు. సమాజంలో లింగ వివక్షకు సంబంధించిన పాత భావజాలాన్ని పురుషులతోపాటు మహిళలు కూడా కొనసాగిస్తున్నారని నటి ఝాన్సీ తెలిపారు. ఇలాంటి ధోరణులను ప్రతిఒక్కరూ గుర్తించి మార్చుకోవాలని సూచించారు.
కోపాన్ని నిర్మాణాత్మకంగా మళ్లించేందుకు క్రీడలు, శారీరక వ్యాయామాలు ఎంతో దోహదపడతాయని నటుడు వంశీ చాగంటి అన్నారు. విభేదాలు వచ్చినప్పుడు వాదనలో గెలవడం కంటే సంబంధాలను కాపాడుకోవడమే ముఖ్యమని కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్ పమేలా సత్పతి అభిప్రాయపడ్డారు. మహిళల అభిప్రాయాలు, అనుభవాలను తక్కువగా చూడటం, వారికి తెలిసిన విషయాలను అనవసరంగా వివరించడం వంటి ధోరణులను మార్చుకోవాలని వీహబ్ సీఈవో సీత పల్లచొల్ల సూచించారు.
