బాలికను రూ.30 వేలకు విక్రయించి, వ్యభిచారం.. 8 మంది నిందితుల అరెస్ట్ 

బాలికను రూ.30 వేలకు విక్రయించి, వ్యభిచారం.. 8 మంది నిందితుల అరెస్ట్ 

మెహిదీపట్నం, వెలుగు: టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో రేప్-, పోక్సో, ఐటీపీఏ చట్టాల కింద నమోదైన కేసును 24 గంటల్లోనే ఛేదించి, 8 మంది నిందితులను అరెస్ట్ చేశామని గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ శనివారం తెలిపారు. గత నెల 2న ఆతిఫ్ అనే వ్యక్తి ఓ బాలికను ఆటోలో అపహరించి అత్తాపూర్ వద్ద సనా, సమ్రీన్ అనే మహిళలకు అప్పగించాడు. వారు ఆ బాలికను వ్యభిచార గృహం నడుపుతున్న సబియా బేగమ్‌కు రూ.30 వేలకు విక్రయించారు. 

సబియా బేగంతోపాటు నదీమ్, కైఫుద్దీన్, అలీ బిన్ అక్రమ్ తదితరులు బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఈ నెల 5న బాధితురాలు ఆ చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ రాఘవేందర్ రెడ్డి పర్యవేక్షణలో టోలిచౌకి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 మొబైల్స్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.