సోషల్ మీడియాలో బతుకమ్మ సందడి కనిపిస్తోంది. సినీ, టీవీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రత్యేక రీల్స్, వ్లాగ్స్‌తో పండుగ వాతావరణాన్ని ముందుగానే తీసుకొస్తున్నారు. ముఖ్యంగా వీ6 రూపొందించే బతుకమ్మ పాటలు తెలంగాణ పల్లె సంస్కృతిని, పండుగ వైభవాన్ని ప్రతిబింబిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఆ పాటలకు మహిళలు బతుకమ్మ ఆడుతూ, యువత రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
బతుకు అంటే ప్రాణం, అమ్మ అంటే దేవత (గౌరీ దేవి) అని అర్థం. బతుకమ్మ అంటే జీవనాన్ని ప్రసాదించే మాతృదేవత లేదా జీవిత పండుగ. ఈ పండుగను భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు దుర్గాష్టమి (సద్దుల బతుకమ్మ) వరకు జరుపుకుంటారు.
తంగేడు పువ్వు (రాష్ట్ర పువ్వు), గునుగు పువ్వు, బంతి పువ్వు, చామంతి, గుమ్మడి పువ్వు, తామర, బీర పువ్వు, కట్ల పువ్వు, గడ్డి పువ్వు, మందారం, నందివర్ధనం వంటి రకరకాల కాలానుగుణ పూలను గౌరమ్మ రూపంలో అందమైన శంఖాకారంలో తాంబూలంలో పేర్చుతారు. మహిళలు కొత్త బట్టలు ధరించి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ జానపద పాటలు పాడుతూ, చప్పట్లతో లయబద్ధంగా నృత్యం చేస్తారు.
తొమ్మిదో రోజైన సద్దుల బతుకమ్మ రోజున మహిళలు పూలతో చేసిన బతుకమ్మలను సమీపంలోని జలాశయాల్లో భక్తితో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ ప్రకృతికి, మానవాళికి, నీటికి, మట్టికి మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటిచెప్పే రాష్ట్ర పండుగ.
రవీంద్రభారతిలో పది రోజులపాటు జరిగే సాంస్కృతిక ఉత్సవాల్లో జానపద గాయకులు, టీవీ యాంకర్లు ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తున్నారు. రాజ్‌భవన్, శిల్పారామంలో జరిగే వేడుకల్లో ప్రముఖులు సంప్రదాయ పట్టుచీరలు ధరించి బతుకమ్మలను పేరుస్తూ సందడి చేస్తున్నారు. సిటీలోని పలు పాఠశాలల్లోనూ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ట్రెండింగ్లో వీ6 బతుకమ్మ పాటలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పూల పండుగ వైభవాన్ని చాటిచెప్తున్నాయి వీ6 న్యూస్ రూపొందించిన బతుకమ్మ పాటలు. ఈ పాటల పరంపరలో ‘చిత్తూ చిత్తుల బొమ్మ’ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వంద మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి విశేష ప్రజాదరణ పొందింది.
కందికొండ సాహిత్యంలో వచ్చిన ‘తెలంగాణ గడ్డమీద’, కైలాష్ ఖేర్, రమాదేవి ఆలపించిన ‘భూమి పొరల నుంచి’ పాటలు మట్టి పరిమళాలను, పల్లె జీవనాన్ని ఆవిష్కరించాయి. ‘జిల్లేడు పూల వలలో.. జిల్లేలమ్మ’, గోరటి వెంకన్న కలం నుంచి జాలువారిన ‘తీరొక్క పూలన్నీ’ పాటలు బతుకమ్మ అందాలను అక్షరాల్లో ఆవిష్కరించాయి.
‘పచ్చ పచ్చని పల్లె’ పాట పల్లె ప్రకృతిని కళ్లకు కడితే.. ‘కొలో కొలో బతుకమ్మ’ పాట చప్పట్ల ఆటపాటల సందడిని ప్రతిబింబిస్తుంది. ‘గౌరి గౌరమ్మ’, ‘పసుపులో పుట్టిన గౌరమ్మ’ పాటలు అమ్మవారి ఆరాధనను, బతుకమ్మ ఆచారాల విశిష్టతను చాటిచెప్తాయి. ఇలా ఒక్కో పాటలో ఒక్కో సంప్రదాయాన్ని, పల్లె జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ వీ6 బతుకమ్మ పాటలు తెలంగాణ ఆడపడుచుల పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
