- డెడ్‌బాడీపై గాయాలు
- ప్రేమ పేరుతో వేధించిన యువకుడే చంపాడని మృతురాలి తల్లి ఫిర్యాదు
పరిగి, వెలుగు: ప్రేమ పేరుతో ఓ యువకుడు తన గ్రామానికి చెందిన యువతిని వేధించాడు.. సాయంత్రం నుంచి రాత్రి వరకు వరుసగా ఫోన్కాల్స్చేస్తుండటంతో అర్ధరాత్రి ఆమె బయటకు వెళ్లింది. అంతే.. ఏం జరిగిందో తెలియదు.. తెల్లారేసరికి వ్యవసాయ బావిలో శవమైంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లిలో చోటుచేసుకుంది. రావులపల్లికి చెందిన కుమ్మరి శీరిష(18) ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ఫెయిల్అవడంతో ఇంటి వద్దే ఉంటూ కుటుంబానికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తోంది.
ఇదే గ్రామానికి చెందిన చరణ్ ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం నుంచి బయటకు రావాలంటూ శిరీషకు పదే పదే ఫోన్‌చేశాడు. చివరికి ఆమె అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. శనివారం ఉదయం శిరీష కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామంలో సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజీని పరిశీలించారు. అందులో ఆమె అర్ధరాత్రి బయటకు వెళ్లిపోయినట్లు కనిపించింది.
దీంతో వారు శిరీష కోసం వెతకడం ప్రారంభించారు. ఊరు చివరి వరకు వెళ్లి, అనుమానంతో అక్కడి వ్యవసాయ బావిలో చూడగా.. శిరీష డెడ్‌బాడీ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చి, మృతదేహాన్ని బయటకు తీయించారు. కాగా, డెడ్‌బాడీపై గాయాలుండటంతో మృతురాలి తల్లి.. చరణ్ తన కూతురిని వేధించాడని, చివరకు ఆమెను హత్య చేసి బావిలో పడేశాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అతని ఫోన్‌తోపాటు శిరీష ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని గ్రామస్తులు తెలిపారు.
