కుత్బుల్లాపూర్, వెలుగు: బంగారం కొనుగోలుకు తల్లితో వెళ్లిన రెండేళ్ల చిన్నారి షాప్లో నిర్లక్ష్యంగా ఉంచిన సైనైడ్ తిని మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. సూర్యాపేటకు చెందిన కృష్ణ, జానకి దంపతులు జీవనోపాధి కోసం చింతల్‌లో నివాసముంటున్నారు. ఈ నెల 7న జానకి తన కూతురు మిషాతో కలిసి స్థానిక విష్ణు జ్యువెలర్స్‌కు చెవికమ్మలు కొనుగోలు చేసేందుకు వెళ్లింది.
దుకాణంలో తల్లి ఆభరణాలు చూస్తుండగా, చిన్నారి ఆడుకుంటూ బయటకు వెళ్లింది. అక్కడ టేబుల్ పై నగలు తయారీకి ఉంచిన సైనైడ్ ను తినేసింది. కొద్ది నిమిషాల్లోనే పాప అపస్మారక స్థితికి చేరుకోగా, వెంటనే హాస్పిటల్కు తరలించారు. అప్పటికే పాప మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
గోల్డ్షాప్యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని ఆరోపిస్తూ శనివారం కుటుంబసభ్యులు, బంధువులు షాప్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రమాదకర సైనైడ్‌ను నిర్లక్ష్యంగా బయట ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
