ఎంగిలిపూల సంబురం... భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహణ

ఎంగిలిపూల సంబురం... భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహణ

హైదరాబాద్  సిటీ, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు నగరంలోని రవీంద్రభారతిలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తొలిరోజు నిర్వహించిన ఎంగిలిపూల వేడుకలకు వందలాది మంది మహిళలు తరలివచ్చారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆడిపాడారు. 

రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై, రాష్ట్ర ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌‌‌‌పర్సన్ వెన్నెల గద్దర్‌‌‌‌, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో..

ముషీరాబాద్: ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో అలయ్​బలయ్​ఫౌండేషన్ చైర్​పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్​శుక్లా సతీమణి జానకి శుక్లా, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు