కాంగ్రెస్‌కు ‘గెలుపు’ అలవాటు తప్పి, అప్పుడప్పుడూ ఒకటీ, అర విజయాల వాసనే అబ్బుతోంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్నికల్లో ‘గెలుపు దాహం’ ఒంటబట్టకపోవడాన్ని కొందరు గొప్ప లక్షణంగా అభివర్ణిస్తే, ఇంకొందరు అదే అతిపెద్ద లోపమని విశ్లేషిస్తారు.
‘ఏమి చేసైనా సరే ఎన్నికల్లో గెలిచి తీరాలి’ అనే తీక్షణ తృష్ణ (కిల్లర్ ఇనిస్టింక్ట్) కాంగ్రెస్‌లో కనుమరుగవుతోంది. ‘గెలిచినోడే మొనగాడు!’ (జో జీతా వొహీ సికందర్) అన్న నానుడి మరింత బలపడుతున్న సమకాలీన రాజకీయాల్లో ‘గెలుపు’ చుట్టపుచూపవుతున్న పార్టీకి దేశ రాజకీయాల్లో మనుగడే కష్టమౌతోంది.
రాహుల్‌కు జనాదరణ హెచ్చింది ఓకే! ఎన్డీయే పదమూడేళ్ల పాలన దృష్ట్యా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది, కావొచ్చు! కానీ, కాంగ్రెస్ ఎదగాలి! విపక్ష ఐక్యత బలపడాలి కదా! ఇటు సొంతపార్టీ కాంగ్రెస్ గెలుపు, అటు ‘ఇండియా కూటమి’ విజయం అత్యవసరమని విపక్షాలు భావిస్తున్న పరిస్థితిల్లో అందరి చూపూ ఇపుడు రాహుల్ గాంధీపైనే కేంద్రీకృతమవుతోంది. కానీ, రాహుల్ దృష్టి కాంగ్రెస్‌పైనే కొరవడుతోంది.
కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అర్జంటుగా ఓ గెలుపు కావాలి. ‘ఫామ్’ దొరకాలి. రాజకీయ అనుకూలతలు, అవకాశాలు ఆటోమెటిక్‌గా ఏ పార్టీకీ ఎన్నికల గెలుపునకు బాటలు వేయవు. పార్టీని పటిష్టపరచడం, కూటమి మిత్రుల మధ్య ఐక్యత సాధన, రాజకీయ సానుకూల వాతావరణాన్ని ప్రజాదరణగా ఓట్ల కిందకి మార్చగలగడం వంటి ప్రత్యేక చర్యలతోనే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుంది.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో, దాని మిత్రపక్ష (ఇండియా) కూటమిలో గెలుపు ఒరవడి కొరవడుతోంది. మరోపక్క పాలక బీజేపీలో గెలుపొక ఆనవాయితీగా మారి ఎన్డీయే కూటమి పటిష్టంగా ఉంది. అసలెందుకీ పరిస్థితి? ఏమిటి కారణాలు? అనే చర్చ తెరపైకి రావడం సహజం.
‘సర్’ అవకతవకలకు, కేంద్రం కనుసన్నల్లో ఏకపక్ష నిర్ణయాలకు కారణమంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్యమంతో దేశమంతా అట్టుడుకుతున్న సమయంలో వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. కానీ, కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదు. దయనీయమైన ఫలితాలు సాధించింది.
పదమూడేళ్లలో ప్రభుత్వ వ్యతిరేకత పతాకస్థాయికి వెళ్లింది అంటున్న ఈ పరిస్థితుల్లోనూ పాలక బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు బేషుగ్గా గెలిచింది. దక్షిణాదిలో మిత్రపక్షం గెలిచింది. ఇవే దేశమంతటికీ వర్తించే సంకేతాలు కాకపోవచ్చు. కానీ, గత కొంతకాలంగా దేశవ్యాప్త సంకేతాలేవీ ‘ఎన్నికల్లో గెలుపు’ పరంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలించలేదు.
సొంతిల్లు చక్కదిద్దుకోవాలి
దేశంలోని ముఖ్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అలవాటు తప్పి దశాబ్దాలవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు ప్రత్యక్ష ఉదాహరణ. గుజరాత్‌లో గడచిన మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పాత్ర ప్రతిపక్షమే! కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో అధికారం చలాయించిన పదేళ్ల (2004-14) కాలంలోనూ అదే పరిస్థితి! వచ్చే ఫిబ్రవరి-మార్చి మాసాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలున్నాయి.
‘ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలంటే, అన్ని ఎన్నికలకు అమ్మవంటివి’ అంటారు. 14 మందిలో 8 మంది దేశ ప్రధానమంత్రులనిచ్చిన నేల అది. 1989 (ఎన్డీ తివారీ) తర్వాత కాంగ్రెస్ సొంతంగా ఎప్పుడూ అధికారంలో లేదక్కడ. గత కొన్నేళ్లుగా సమాజ్‌వాది పార్టీకి మైనర్ పార్టనర్‌గా ఉంటోంది. మిగతా భాగస్వాములకన్నా గెలుపు నిష్పత్తి (సక్సెస్ రేట్) కాంగ్రెస్‌కే తక్కువగా ఉంటోంది. కాంగ్రెస్ వెనుకబాటు పరిస్థితి వల్లే 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) ముఖ్యమంత్రి కాలేకపోయారనే నింద ఉంది.
పంజాబ్‌లో ఆప్ తిరిగి అధికారం నిలబెట్టుకునే సూచనలున్నాయి. గోవాలో అయితే ‘ఆప్’ మరో మిత్రపక్షంతో కూడిగాని, బీజేపీగానీ గెలవొచ్చంటున్నారు. మణిపూర్‌లో కాంగ్రెస్‌కు ఆశావహ పరిస్థితుల్లేవు. వరుసగా ఒకే పార్టీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆనవాయితీ లేని ఉత్తరాఖండ్‌లో కిందటి ఎన్నికల్లో బీజేపీ తమ ప్రభుత్వాన్ని నిలుపుకోగలిగింది. సరిగ్గా ఏడాది నాటికి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలున్నాయి. ముప్ఫై సంవత్సరాలుగా కాంగ్రెస్ గుజరాత్‌ను గెలవలేదు. తరచూ ప్రభుత్వాలను మార్చే హిమాచల్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేస్తారో వేచి చూడాల్సిందే!
దేశంలో హిమాచల్‌తో పాటు కర్నాటక, తెలంగాణలో సొంత ప్రభుత్వాలున్న కాంగ్రెస్ కేరళలో యూడీఎఫ్ కూటమి సర్కారుకు నేతృత్వం వహిస్తూ, జమ్మూ- కాశ్మీర్, జార్ఘండ్, తమిళనాడు రాష్ట్రాల్లోని మిత్రపక్ష ప్రభుత్వాల్లో మైనర్ పార్టనర్‌గా ఉంది.
ఓట్లు పెరగకుండా గెలుపెలా ?
తనను తాను మెరుగుపరచుకుంటున్న రాహుల్ గాంధీ తాను నేతృత్వం వహించే కాంగ్రెస్‌ను బాగుచేయలేకపోతున్నారు. రాహుల్ ఉపన్యాసాల్లో నాణ్యత, వ్యక్తీకరణల్లో స్పష్టత, విమర్శల్లో వాడీవేడీ పెరిగింది. ఎక్కువ మందిని ఆకట్టుకోగలుగుతున్నారు.
కానీ, కాంగ్రెస్ ఆ స్థాయిలో మెరుగయ్యేందుకు ప్రత్యేక చర్యలేవీ రాహుల్ తీసుకుంటున్న దాఖలాలు లేవు. ‘చాత్రోంకీ గూంజ్’ పేరిట దేశంలోని వివిధ ప్రాంతాల్లో యువజన, విద్యార్థి సదస్సుల్లో పాల్గొంటూ ఆయన ఎంతో ప్రజాదరణ పొందుతున్న సమయంలో అస్సాంలోని నవ్‌గ్రామ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి జారి, 9శాతం ఓటు వాటా పొందింది.
ఇక్కడే కాకుండా బీజేపీ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచింది. పుదుచ్చేరిలో బీజేపీ మద్దతిచ్చిన మిత్రపక్షం ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. తమిళనాడు పాలకపక్షం, సీఎం విజయ్ నేతృత్వపు టీవీకే మద్దతిచ్చినా కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. అదే టీవీకే అభ్యర్థులు తమిళనాడులోని రెండు స్థానాల్లో గెలిచారు. కాంగ్రెస్‌కు ఎక్కడా ఒక గెలుపు దక్కలేదు. రాహుల్‌కు పెరిగే ప్రజాదరణ కాంగ్రెస్ పార్టీకి బలంగా మారటం లేదు. పార్టీకి ఓట్లు పెరగకపోవడం ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది.
సంస్థాగతంగా బలహీనపడిన కాంగ్రెస్
2009-–24 మధ్య, అంటే ఒక యూపీఏ ప్రభుత్వం, రెండు ఎన్డీయే ప్రభుత్వాల కాలంలో బీజేపీకి లభించిన ఓట్లు 7.84 కోట్ల నుంచి 23.59 కోట్లకు పెరిగితే, అదేకాలంలో కాంగ్రెస్ ఓట్లు 11.9 కోట్ల నుంచి 13.67 కోట్లకు మాత్రమే పెరిగాయి. దేశాన్ని దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ ఈ రోజున సంస్థాగతంగా బలహీనపడింది. నాయకత్వ సంబంధాలు సన్నగిల్లాయి. యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తామన్నది 2022 ఉదయ్‌పూర్ ‘చింతన్ శిబిర్’లో పార్టీ వాగ్దానం.
అయితే తెలంగాణ మంత్రివర్గంలో ‘యువత’ ప్రాధాన్యత ఎంత? కర్నాటక మంత్రివర్గం (33 మంది)లో ఒక్క మహిళా లేరు! 50 యేళ్లలోపు వారికి నాయకత్వ అవకాశాలు, దళిత, ఆదివాసీ, బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఏ మేరకు అమలవుతోంది? ప్రశ్నించుకోవాలి. పార్టీ అనుబంధ విభాగాలు బాగా బలహీనపడ్డాయి. ఆంధ్ర, తెలంగాణలోనే కాదు అఖిల భారత స్థాయిలో వాటికి నేతృత్వం వహిస్తున్నదెవరో ఎవరికీ పెద్దగా తెలియదు. మరోవైపు బీజేపీ సంస్థాగతంగా ఎన్నో రెట్లు బలపడింది. పైపెచ్చు దానికి ఆర్‌ఎస్‌ఎస్ దన్ను కూడా ఉంది.
‘గెలుపు’ వ్యూహమే తరువాయి..
కేంద్రంలో ప్రభుత్వ పాలన, ఎన్నికల వ్యవస్థ, ఉద్యోగ- ఉపాధి కల్పన, విద్య-పరీక్షల సంస్కరణలు వంటి అంశాలపై పోరాటానికి శ్రద్ధ పెట్టినట్టే పార్టీ సంస్థాగత విస్తరణ, పటిష్టత, ఎన్నికల్లో వ్యూహాలపైన కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించాలి. ‘ఇండియా కూటమి’ బలోపేతానికి మిత్రులతో సయోధ్య నెరపాలి. 2024 ఎన్నికల్లో అది కొంతవరకు ఫలించింది. కానీ, తర్వాతి కాలంలో కొంత బెడిసింది.
ఆప్, డీఎంకే, ఎన్సీపీ వంటి పార్టీలు దూరమయ్యాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల (జూన్ 2029)లోపు 20 రాష్ట్రాల అసెంబ్లీలకు (2437 స్థానాలకు) ఎన్నికలుంటాయి. అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు హిమాచల్, కర్నాటక, తెలంగాణ కూడా ఉన్నాయి.
2252 అసెంబ్లీ స్థానాలకు లోగడ ఎన్నికలు జరిగితే, 185 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయలేదు. 1746 స్థానాల్లో ఓడిపోయి 506 చోట్ల మాత్రమే (22శాతం) నెగ్గింది. 2024 సాధారణ ఎన్నికల తర్వాత 11 రాష్ట్రాల్లో మిత్రులతో కలిసి పోటీ చేసి, నాలుగు చోట్ల (జమ్మూ కాశ్మీర్, జార్ఘండ్, కేరళ, తమిళనాడు) సంకీర్ణ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ భాగస్వామి అయింది. మొత్తం 1686 స్థానాలకుగాను, పొత్తుల్లో తనకు లభించిన 924 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 171 చోట్ల (19 శాతం) మాత్రమే నెగ్గింది. ‘జో జీతా వొహీ సికందర్’ అని కాంగ్రెస్ మరవకూడదు.
దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
- ఓపెన్పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ [email protected]
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
