తీరొక్క పూలు.. చప్పట్ల తాళాలు.. జానపదాల హోరు.. ఆడపడుచుల ఆటపాటలు! బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ కాదు. ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం.. మహిళల ఐక్యతకు ప్రతీక.. తరతరాలుగా అందుతున్న తెలంగాణ సాంస్కృతిక వారసత్వం. గునుగు, తంగేడు, బంతి వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను కొలుస్తూ ఆడిపాడే ఈ వేడుకలో పల్లె జీవితం పరిమళిస్తుంది. కాలం మారినా.. తరాలు మారినా.. బతుకమ్మ వైభవం తగ్గలేదు. పాటల్లో తెలంగాణ యాసను, ఆటల్లో ఆత్మీయతను నింపుతూ పూల పండుగ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతోంది.
ముందుగా బొడ్డెమ్మ
ఎంగిలిపూల అమావాస్యకు ముందు భాద్రపద బహుళ దశిమి నుంచి బొడ్డెమ్మ పండుగ మొదలవుతుంది. ‘బొడ్డె’ అంటే ‘చిన్న అమ్మాయి’ అని అర్థం. కాబట్టి ఇది స్త్రీగా ఎదిగే క్రమానికి అంకితం చేయబడిన పండుగ. బాలికలు, యువతులు రాత్రిపూట ఆడుతూ, బృందాలుగా చేరి బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. మట్టితో, పువ్వులతో ఈ బొడ్డెమ్మను చేసి ఆడుతూ ఉంటారు.
కథలే పాటలై
బతుకమ్మ అంటేనే పాటల పండుగ. ఎన్నో జానపద కథలూ, గాథలూ, పాటలూ వందలాది ఏండ్ల నుంచి వాడుకలో ఉన్నాయి. లిఖిత సాహిత్యం అందుబాటులో లేని సమయంలోనే బతుకమ్మ పాటలు ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వ సంపదగా వచ్చాయి. ధర్మాంగుడు అనే రాజు కథ మొదలుకుని అన్నాచెల్లెళ్ల అనుబంధం, తల్లీబిడ్డల బంధం, పౌరాణిక, సమకాలీన, సామాజిక జీవన చిత్రాలన్నీ ఈ పాటల్లో కనిపిస్తాయి.
రాగయుక్తంగా, లయబద్ధంగా జానపద శైలిలో కొనసాగుతూ దేశీయ సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. అదే సమయంలో వయసు, వృత్తి, స్థాయిభేదాలతో సంబంధం లేకుండా అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పండుగలో భాగమవుతారు. అందుకే బతుకమ్మ అనుబంధాలు, ఆత్మీయతల పండుగ.
1వ రోజు ఎంగిలిపూల బతుకమ్మ
బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడడం సంప్రదాయం. తొలిరోజున పేర్చిన బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’గా పేర్కొంటారు. మొదటి రోజు చేసుకునే ఎంగిలి పూల బతుకమ్మ పేర్చుకునేందుకు సిబ్బిలు, తంగేడు పూలు, గునుగు, తామర, చామంతి, బంతి, సీత జడలు పూలు ఎక్కువగా వినియోగిస్తారు. మొదట తంగేడు పూలలు పెట్టుకుని ఆ తర్వాత రంగులను బట్టి పూలను అమర్చుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మ కోసం ముందు రోజుగానే పూలు తెచ్చి నీళ్ళలో వేసుకుని ఉంచుతారు. అలా పూలు నిద్ర చేస్తాయి. అందుకే ఎంగిలి పూలు అంటారు. అది మాత్రమే కాదు పూలకు ఉన్న ఆకులు, కాడలు తెంచడం కోసం కత్తెర లేదా నోటితో వాటిని కట్ చేస్తారు. అంటే ఎంగిలి చేసినట్టు అర్థం వస్తుంది.
2వ రోజు అటుకుల బతుకమ్మ
ఆశ్వయుజ మాసంలో తొలి రోజైన పాడ్యమి నాడు జరుపుకొనే బతుకమ్మను ‘అటుకుల బతుకమ్మ’ అని పిలుస్తారు. తీరొక్క పూలను రెండు ఎత్తులలో బతుకమ్మను పేర్చి, ఆడవాళ్లంతా కలసి ఆడుకుని సాయంత్రం చెరువులలో నిమజ్జనం చేస్తారు. ఈ రోజున అమ్మకు ఎంతో ఇష్టమైన చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు.. వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ
బతుకమ్మ ఆటలో మూడో రోజైన విదియ నాడు అమ్మను ‘ముద్దపప్పు బతుకమ్మ’గా కొలుస్తారు. ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అందంగా అలంకరిస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి గౌరమ్మకి నివేదిస్తారు. ఆపై ప్రసాదాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. ముద్దపప్పు బతుకమ్మ రోజున కొందరు పుట్నాల పిండి, బియ్యప్పిండి, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు, పాలతో ‘చలివిడి’ ముద్దలు చేస్తారు. ఇంకొందరు గారెలు చేస్తారు. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశాక వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడతారు.
4వ రోజు నానబియ్యం బతుకమ్మ
నాలుగో రోజున ‘నానబియ్యం బతుకమ్మ’గా పేర్కొంటారు. నైవేద్యం కోసం మొదట బియ్యాన్ని నానబెట్టి, ఆ తర్వాత ఆరబెట్టి.. మెత్తగా పిండి చేస్తారు. అందులో పాలు, చక్కెర, నెయ్యి వేసి పాలకాయల్లా చిన్న ఉండలు చేస్తారు. వీటిని పచ్చిపిండి ముద్దలని పిలుస్తారు. శరదృతువులో వచ్చే పండుగల్లో వీటిని ప్రత్యేక నివేదనగా సమర్పిస్తారు. కొత్తగా వడ్లు వచ్చే ఈ కాలంలో బియ్యానికి కొదువ ఉండదు. పైగా ఇవంటే అమ్మకు ఎంతో ప్రీతి. అందుకే, నానిన బియ్యంతో చేసిన పదార్థాలు నైవేద్యం పెడతారు.
5వ రోజు అట్ల బతుకమ్మ
ఐదో రోజున బతుకమ్మను ‘అట్ల బతుకమ్మ’ అంటారు. బియ్యాన్ని నానబెట్టి, దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘అట్ల బతుకమ్మ’ అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు ఈ రోజున ఎరుపు, లేదా ఆకుపచ్చరంగు బార్డర్ కలిగిన తెల్లచీరలు ధరిస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముతైదువులు తాము దేవతకు సమర్పించిన అట్లను ఒకరికొకరు వాయినంగా ఇచ్చి పుచ్చుకుంటారు. ఐదో రోజు కూడా ప్రతీ రోజు వలే ఇల్లంతా శుభ్రం చేసుకుని.. తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, చామంతి పూలు, మందారం, గుమ్మడి పూలతో బతుకమ్మను అందంగా పేరుస్తారు.
6వ రోజుఅలిగిన బతుకమ్మఅలిగిన బతుకమ్మ
ఆరో రోజున అమ్మవారిని ‘అలిగిన బతుకమ్మ’గా పిలుస్తారు. పూర్వం బతుకమ్మలను పేర్చేటప్పుడు మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు. కాబట్టి ఈరోజు బతుకమ్మలను తయారుచెయ్యరు. నైవేద్యం కూడా సమర్పించరు. అలక తీరాలని ప్రార్థిస్తారు. మరో చరిత్రలో.. దేవీభాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందంటారు. భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిన అమ్మవారికి ఓ రోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరోనాడు బతుకమ్మ ఆడరు. దాన్నే అర్రెం, అలసిన బతుకమ్మ అంటారు. అదే అలిగిన బతుకమ్మగా మారింది.
7వ రోజు వేపకాయల బతుకమ్మ
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అందరి ఇళ్లలో సందడి చేస్తుంది. వేపచెట్టు అంటే ఆ ఆదిపరాశక్తికి ప్రతిరూపం. ఆ ఆదిపరాశక్తికి నీరాజనాలు అర్పిస్తూ ఈ బతుకమ్మను ఆరాధిస్తారు. తెలంగాణలో శక్తి స్వరూపంగా ఎల్లమ్మ దేవతను ఎంతో భక్తి పారవశ్యంతో పూజిస్తారు. వేపకాయల బతుకమ్మ పండుగరోజు చామంతి, గునుగు, తంగేడు, గులాబీ పూలతో ఏడరోజును ప్రతిబింబించేలా ఏడు అంతరాలలో బతుకమ్మను పేరుస్తారు. సకినాలను తయారుచేయడానికి ఉపయోగించే పిండితో చిన్న వేపపండ్లు ఆకారంలో చిన్న ముద్దలు చేసి వాటిని బతుకమ్మకు పెడతారు. అలాగే నైవేద్యంగా బెల్లం, పప్పు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.
8వ రోజువెన్నముద్దల బతుకమ్మ
గులాబీ, చేమంతి, తంగేడు, గునుగు, గడ్డి పూలతో బతుమ్మను పేరుస్తారు. వెన్నతో చేసిన పదార్థాలను నివేదిస్తారు కాబట్టి ‘వెన్నముద్దల బతుకమ్మ’ అంటారు. ఈరోజు నైవేద్యంగా నువ్వులు, బెల్లం, వెన్న లేదా నెయ్యి కలిపిన పదార్థాలు గౌరమ్మకు సమర్పిస్తారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ తరువాత నుంచి ఒక్కో రోజు ఒక్కో వరుసను పెంచుకుంటూ బతుకమ్మను పేరుస్తారు తెలంగాణ ఆడపడుచులు. ఈరోజు ఎనిమిది వరుసలతో బతుకమ్మను త్రికోణంలో లేదా వలయాకారంలో పేరుస్తారు. బతుకమ్మ సంబరాల్లో ఎనిమిదో రోజున అమ్మను ‘వెన్నముద్దల బతుకమ్మ’ అని పిలుస్తారు.
9వ రోజుసద్దుల బతుకమ్మ
ఆశ్వయుజ మాసంలో ఎనిమిదో రోజైన దుర్గాష్టమి నాడు బతుకమ్మను ‘సద్దుల బతుకమ్మ’గా జరుపుకుంటారు. దీన్ని ‘పెద్ద బతుకమ్మ’ అంటారు. ఈ రోజున తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ.. ఇలా రెండు బతుకమ్మలను పేర్చి.. హోరెత్తే ఉయ్యాల పాటలతో మహిళలంతా ఎంతో వైభవంగా బతుకమ్మ ఆట ఆడుకుంటారు. ఈ రోజున పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి.. ఇలా ఐదు రకాల సద్దులను అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన తర్వాత బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో అంగరంగ వైభవంగా కొనసాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.
