బయోమెట్రిక్ పేరు మార్చి..  మళ్లీ బాదుడే! ..రూ.వంద బయోమెట్రిక్ ఫీజు ఎత్తేసి.. ఎగ్జామ్ ఫీజులో కలిపిన్రు

బయోమెట్రిక్ పేరు మార్చి..  మళ్లీ బాదుడే! ..రూ.వంద బయోమెట్రిక్ ఫీజు ఎత్తేసి.. ఎగ్జామ్ ఫీజులో కలిపిన్రు

 

  • 'వెలుగు' కథనంతో గుట్టురట్టైనా తీరు మార్చుకోని ఓయూ అధికారులు
  • విద్యార్థులకు భారం తగ్గించకుండా 'అడ్జస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌' మాయాజాలం
  • అన్ని డిగ్రీ కోర్సుల్లో ఇదే దందా.. మండిపడుతున్న స్టూడెంట్లు

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తమ చేతివాటానికి సరికొత్త తెలివితేటలు జోడించారు. ఏండ్లుగా చేస్తున్న తప్పు బయటపడినా.. విద్యార్థులపై భారం తగ్గించాలన్న ఆలోచన చేయకుండా వింత చర్యలకు పాల్పడుతున్నారు. వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో పనిచేయని బయోమెట్రిక్ పేరిట అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజుల బాగోతం బట్టబయలవడంతో సరికొత్త జిమ్మిక్కు చేశారు. బయోమెట్రిక్ ఫీజు రూ.వంద రద్దు చేసి విద్యార్థులకు ఊరట కల్పించాల్సింది పోయి.. ఆ పేరును మాత్రమే ఎత్తేసి, అదే వంద రూపాయలను సైలెంట్‌‌‌‌గా మెయిన్ ఎగ్జామ్ ఫీజులో కలిపేసి మళ్లీ విద్యార్థుల జేబులే గుల్ల చేస్తున్నారు.

వెలుగు కథనంతో దిగొచ్చి.. అంతలోనే అడ్డదారి తొక్కి

'ఓయూలో బయోమెట్రిక్ పని చేయకున్నా.. ఆరేండ్లుగా ఆగని ఫీజుల వసూళ్లు..' శీర్షికతో గత నెల 4న 'వెలుగు'  దినపత్రికలో కథనం ప్రచురితమైంది. కాలేజీల్లో అసలు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానమే అమల్లో లేకపోయినా, సెమిస్టర్‌‌‌‌కు రూ.వంద చొప్పున కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న తీరును 'వెలుగు' ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ కథనంతో దిగొచ్చి తప్పును సరిదిద్దుకుని ఆ ఫీజును శాశ్వతంగా రద్దు చేస్తారని అంతా భావించారు.

కానీ ఓయూ అధికారులు మాత్రం విద్యార్థుల నెత్తిన పడే భారాన్ని ఏమాత్రం తగ్గించకుండా.. చలాకీగా ఫీజు హెడ్డింగ్ మార్చేసి వసూళ్ల దందాను యథావిధిగా కొనసాగిస్తున్నారు. బీఏ, బీఎస్​డబ్ల్యూ కోర్సుల్లో గతంలో మొత్తం సెమిస్టర్ ఫీజు రూ.1,790గా ఉండేది. ఇందులో రూ.1,540 ఎగ్జామ్ ఫీజు, రూ. 150 మెమో చార్జీ, రూ.100 బయోమెట్రిక్ అటెండెన్స్ ఫీజు ఉండేది. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌‌‌‌లో బయోమెట్రిక్ పేరును తీసేశారు. కానీ, ఆ రూ.వందను ఎగ్జామ్ ఫీజులో కలిపేసి.. దాన్ని రూ.1,640 చేశారు. మెమో ఫీజు రూ. 150 కలిపి యథావిధిగా రూ. 1,790 గుంజుతున్నారు.

బీకాం, బీఎస్సీల్లోనూ ఇదే తంతు. ఈ కోర్సులకు సైతం గతంలో మొత్తం రూ.1,940 (రూ. 1,690 ఎగ్జామ్ ఫీజు + రూ.150 మెమో + రూ.100 బయోమెట్రిక్) వసూలు చేసేవారు. ఇప్పుడు బయోమెట్రిక్ పేరును తొలగించి, మెయిన్ ఎగ్జామ్ ఫీజును రూ.1,790కి పెంచారు. మెమో ఫీజు రూ.150తో కలిపి మొత్తం రూ.1,940 విద్యార్థుల నుంచే లాగుతున్నారు. బీబీఏలోనూ విద్యార్థుల నుంచి గతంలో మాదిరిగానే మొత్తం రూ.2,190 తీసుకుంటున్నారు. ఇతర కోర్సుల తరహాలోనే బయోమెట్రిక్ రూ.100ను తీసేసి, నేరుగా పరీక్ష ఫీజులోనే కలిపేశారు. 

అధికారుల తీరుపై విద్యార్థుల ఆగ్రహం

ఏండ్ల తరబడి లేని బయోమెట్రిక్ పేరుతో కోట్ల రూపాయలు విద్యార్థుల నుంచి దండుకున్న అధికారులు, తప్పు బయటపడగానే ఇలా ఫీజు అడ్జస్ట్‌‌‌‌మెంట్లు చేయడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేరు మారిస్తే విద్యార్థులపై భారం తగ్గనట్టే కదా? ఇదెక్కడి లెక్క? అని మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా ఈ మోసపూరిత విధానాన్ని వీడి, అదనంగా కలిపిన రూ.వంద పరీక్ష ఫీజును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.