హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఎన్నికల్లో గెలుపొందిన ఎంప్లాయిస్ యూనియన్ ( ఈయూ ) కూటమి నేతలు హైదరాబాద్ లోని బస్ భవన్ ఎదుట సంబరాలు చేసుకున్నారు. శనివారం ఈయూ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) కూటమి నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, మౌలానా ఇతర నేతలు ఆయా యూనియన్లకు చెందిన కార్మికులతో కలిసి బస్ భవన్ చేరుకున్నారు. ఎన్నికల్లో గెలుపుపై సంబరాలు చేసుకున్నారు.
అనంతరం ఈదురు వెంకన్న కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ...పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఆర్టీసీలో ఎన్నికలు జరిపించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చిస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈయూ కూటమి గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఓటు వేసి గెలిపించిన కార్మికులకు థ్యాంక్స్ చెప్పారు.కార్మికులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తామని ఈదురు వెంకన్న కార్మికులకు హామీ ఇచ్చారు.
