- కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్
న్యూఢిల్లీ: భారతీయ యువతను ఎవరూ ఆపలేరని ఎల్‌జేపీ (రామ్ విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. రైళ్లను రద్దు చేసి భారతీయ యువతను అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
శనివారం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) తలపెట్టిన నిరసనల దృష్ట్యా ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా వరుస ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి చిన్న విషయానికీ ఢిల్లీలో జన జీవనాన్ని స్తంభింపజేయడం ఎంతమాత్రం తగదని చిరాగ్ పాశ్వాన్ హితవు పలికారు.
ఢిల్లీలో భారీగా భద్రతా బలగాల మోహరింపు, రైళ్ల రద్దు, మెట్రో సేవల విఘాతం వల్ల విద్యార్థులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. ‘‘వీరు భారతీయ యువకులు.. వీరిని ఏ శక్తీ ఆపలేదు. కొందరు తప్పుడు ప్రచారాలతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు.
ఎన్ని రైళ్లను ఆపగలరు? రవాణా వ్యవస్థను ఎంతవరకు నిలిపివేయగలరు? ఎన్ని రహదారులను దిగ్బంధించగలరు?’’ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో విజయం సాధించలేకే, నిరసనల ముసుగులో ప్రతిపక్షాలు సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
