కొడుకు, బిడ్డను బావిలోకి తోసి తల్లి సూసైడ్.. మహబూబాబాద్‍ జిల్లా బలపాల లింగ్యా తండాలో ఘోరం

కొడుకు, బిడ్డను బావిలోకి తోసి తల్లి సూసైడ్.. మహబూబాబాద్‍ జిల్లా బలపాల లింగ్యా తండాలో ఘోరం
  • ఆడుకునేందుకెళ్లి ప్రాణాలు దక్కించుకున్న చిన్న కూతురు
  • భార్యభర్తల మధ్య గొడవలే కారణమని అనుమానం 

కురవి (మహబూబాబాద్‍), వెలుగు: బతుకమ్మ పండుగపూట ఆడబిడ్డలంతా ఆటపాటలకు వెళ్తున్నవేళ.. కొడుకు, బిడ్డతో కలిసి బావిలోదూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న హృదయవిధాకర  ఘటన మహబూబాబాద్‍ జిల్లా కురవి మండలం బలపాల లింగ్యా తండాలో శనివారం జరిగింది. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోతు నవీన్‍, అదే తండాకు చెందిన అనూష (35)ను కొన్నేండ్ల కింద వివాహం చేసుకున్నాడు. వారికి కూతురు వర్షిణి (9), కుమారుడు నిహల్‍ కృష్ణ (5) కూతురు రిత్విక (4) ఉన్నారు. కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలో ఇరువురి తల్లిదండ్రులు వారికి సర్దిచెప్పారు. అదేసమయంలో వారికి ఆర్థిక సమస్యలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో శనివారం కుటుంబానికి జీవనాధారంగా ఉండే ఆటోను నవీన్‍ విక్రయించాడు. ఈ విషయంలో మరోసారి భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అనూష బిడ్డాకొడుకులు వర్షిణి, నిషాల్‍ కృష్ణను తీసుకొని శనివారం సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. 

తొలుత ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి, ఆపై ఆమె కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అనూష తన పిల్లలతో బావి వద్దకు వెళ్లే సమయంలో మరో కూతురు రిత్విక తండాలోని మరో ఇంటివద్ద ఆడుకోడానికి వెళ్లడంతో ఆ చిన్నారి ప్రాణాలతో మిగిలింది. కాగా, బతుకమ్మ పండుగపూట ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

నవీన్‍ ఇంటివద్ద ఉద్రిక్తత 

మృతురాలి భర్త నవీన్‍ ఇంటివద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న మహబూబాబాద్‍ రూరల్‍ సీఐ అంజలి, కురవి ఎస్సై సతీశ్ ఘటనా స్థలానికి చేరుకుని ఎటువంటి ఆందోళనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మరణానికి కారణం హత్యా, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ముగ్గురి మృతదేహాలను  బావిలో ని నుంచి బయటకు తీసి పోస్టు మార్టం కోసం ఏరియా హాస్పిటల్‍ కు తరలించారు.