- బహిరంగ లేఖ విడుదల చేసిన 124 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘంపై విపక్షాలు చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలు అవాస్తవమని, అన్నీ అనుమానాలే కానీ ఆధారాలు కావని 124 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు తేల్చిచెప్పారు. ఎన్నికల సంఘంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను సమర్థిస్తూ వారు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆరోపించేవారు తగిన ఆధారాలు చూపాలని స్పష్టం చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఓట్ల రిగ్గింగ్ జరిగిందంటూ ప్రచారం చేయడం ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఉండే నమ్మకాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయంటూ ప్రతిపక్ష నేతలు నిరసనలు తెలుపుతున్న సమయంలో మాజీ బ్యూరోక్రాట్లు ఈ లేఖను విడుదల చేశారు. తాము సుదీర్ఘకాలం పాటు ఎన్నికల నిర్వహణలో పనిచేశామని, ఈవీఎంల భద్రత, స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు ప్రక్రియ తమకు పూర్తిగా తెలుసని తెలిపారు. తాము ఏ రాజకీయ పార్టీకి చెందమని, ఆధారాలు లేకుండా రిగ్గింగ్ అనే పదం వాడడం వల్ల ప్రజాస్వామ్య విశ్వసనీయత దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బూత్ క్యాప్చరింగ్, బ్యాలెట్ బాక్సుల దొంగతనాలు వంటి హింసాత్మక ఘటనలు ఉండేవని, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని గుర్తుచేశారు.
గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా వద్దు
తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి రీ-పోలింగ్ జరగకపోవడం ఎన్నికల నిర్వహణలో మెరుగుదలకు నిదర్శనమని లేఖలో పేర్కొన్నారు. 1951 తర్వాత అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావడం, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడం ఎన్నికల సంఘం పారదర్శకతకు నిదర్శనమని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలిస్తారని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎం గణనతో సరిపోల్చే పకడ్బందీ విధానం అమల్లో ఉందని తెలిపారు.
ఎన్నికల్లో గెలిచినప్పుడు ఒకలాగా, ఓడిపోయినప్పుడు ఈవీఎంలను తప్పుపట్టడం సరికాదని మాజీ అధికారులు హితవు పలికారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టడం తగదని స్పష్టం చేశారు. ముగ్గురు కమిషనర్లు సామూహికంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడం వల్ల ఏ ఒక్కరి ఏకపక్ష నిర్ణయాలకు తావు ఉండదని తెలిపారు. ఈ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీరును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనకు దిగిన నలుగురు మాజీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, మాణిక్య సర్కార్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
