- నేటి నుంచి 17 దాకా ఇంటర్నేషనల్ స్టడీ టూర్
హైదరాబాద్, వెలుగు: వివిధ దేశాల్లో విద్యా విధానాలు, బోధనా పద్ధతులను అధ్యయనం చేసి మన సర్కారు స్కూళ్లలో అమలు చేసే క్రమంలో తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది. విదేశీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా రాష్ట్రానికి చెందిన 40 మంది టీచర్లు, విద్యాశాఖ అధికారుల బృందం ఆదివారం వియత్నాం పర్యటనకు బయల్దేరనుంది. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు పర్యటన కొనసాగనుందని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
వియత్నాం రాజధాని హనోయ్‌లోని ‘వియత్నాం ఎడ్యుకేషన్ స్ట్రాటజీ అండ్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (వెస్పీ)’ సహకారంతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ టీమ్ విద్యార్థి కేంద్రీకృత బోధన, సమ్మిళిత విద్య, సమగ్ర కరికులం రూపకల్పన, డిజిటల్ టెక్నాలజీ అనుసంధానం, అంతర్జాతీయ పీసా పరీక్షల్లో విద్యార్థుల ఉత్తమ ప్రతిభకు వియత్నాం అవలంబిస్తున్న విధానాలపై స్టడీ చేయనుంది. పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖ విద్యా సంస్థల నిపుణులతో సెషన్లు, స్కూళ్ల ప్రత్యక్ష పరిశీలన, అక్కడి టీచర్లు, పరిశోధకులతో చర్చాగోష్టుల్లో పాల్గొననున్నారు.
అక్కడ నేర్చుకున్న ఉత్తమ పద్ధతులను తెలంగాణ విద్యా వ్యవస్థకు అనుగుణంగా మార్చి బడుల్లో అమలు చేయనున్నారు. ఇప్పటికే ఫిన్ లాండ్, జపాన్, సింగపూర్ (రెండు టీములు) దేశాల్లో స్కూల్ టీచర్ల బృందాలు పర్యటించాయి. తాజాగా వియత్నాం వెళ్తున్న 5వ బృందానికి స్కూల్ ఎడ్యుకేషన్ జేడీ వెంకటనరసమ్మ నేతృత్వం వహించనున్నారు.
