దేవదుర్గ బంగారు గనిపై సింగరేణి ఫోకస్!..తొలిసారి గనుల అన్వేషణ లైసెన్స్ దక్కించుకున్న సంస్థ

దేవదుర్గ బంగారు గనిపై సింగరేణి ఫోకస్!..తొలిసారి గనుల అన్వేషణ లైసెన్స్ దక్కించుకున్న సంస్థ
  •     199.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గోల్డ్, కాపర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లొరేషన్ బ్లాక్
  •     నేడు సింగరేణి ఉన్నతాధికారులతో కలిసి కర్నాటకకు డిప్యూటీ సీఎం 

హైదరాబాద్, వెలుగు: కర్నాటక రాష్ట్రంలోని దేవదుర్గ బంగారు గనిపై సింగరేణి సంస్థ ఫోకస్​ పెట్టింది. ఇన్నాళ్లూ బొగ్గు తవ్వకాలకే పరిమితమైన సంస్థ.. కేంద్రం నిర్వహించిన వేలంలో తొలిసారిగా గోల్డ్, కాపర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లొరేషన్ బ్లాక్ ను దక్కించుకొని.. బంగారం, రాగి లాంటి విలువైన  ఖనిజాల అన్వేషణకు శ్రీకారం చుట్టబోతున్నది. ఐదేండ్ల పాటు ఖనిజ నమూనాలను సేకరించి.. కొత్తగూడెం ల్యాబ్​లో పరీక్షలు నిర్వహించనున్నారు. బంగారు గనిని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి గురువారం సింగరేణి ఉన్నతాధికారులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కర్నాటక రాష్ట్రానికి వెళుతున్నారు. గోల్డ్ , కాపర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లొరేషన్ బ్లాక్ ను సందర్శించడంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. 

దేవదుర్గ బంగారం, రాగి ఖనిజ బ్లాక్‌‌లో ఇప్పటి వరకు చేపట్టిన పనులు, భౌగోళిక పరిస్థితులు, ఖనిజ నిక్షేపాల అన్వేషణకు చేపట్టాల్సిన తదుపరి చర్యలపై చర్చిస్తారు. బంగారం అన్వేషణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందిస్తారు. డిప్యూటీ సీఎం భట్టి అధికారిక పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాలు, ఇతర అంశాల్లో కర్నాటక ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాన్ని తీసుకుంటామని బుధవారం డిప్యూటీ సీఎం భట్టి ప్రజాభవన్​లో మీడియా ముందు ప్రకటించారు.

కొత్తగూడెంలో ఖనిజ నమూనాల పరీక్ష

కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో సుమారు 199.13 చదరపు కిలోమీటర్ల పరిధిలో దేవదుర్గ  బ్లాక్ విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో బంగారం, రాగి నిల్వలు ఉన్నాయి. కేంద్ర గనుల శాఖ నిర్వహించిన ఆన్‌‌లైన్ వేలంలో సింగరేణి సంస్థ అత్యధికంగా 37.75% రాయల్టీ వాటాను కోట్ చేసి ఈ అన్వేషణ లైసెన్స్ దక్కించుకుంది. అధికారికంగా పనులను ప్రారంభించడానికి వీలుగా బెంగళూరులో కర్నాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో సింగరేణి సంస్థ ఇదివరకే ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే రెండేండ్లలోనే ప్రాథమిక స్థాయిలో 'జీ4' దశ అన్వేషణను పూర్తి చేయాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. 

రిమోట్ సెన్సింగ్, జియోలాజికల్ మ్యాపింగ్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించిన అనంతరం ఎంపిక చేసిన ప్రాంతాల్లో డ్రిల్లింగ్ పనులు మొదలుపెట్టనున్నారు. ఇలా సేకరించిన ఖనిజ నమూనాలను కొత్తగూడెంలో సింగరేణి కొత్తగా ఏర్పాటు చేసిన 'జియో సైన్స్ లాబొరేటరీ లో పరీక్షించి.. తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ అన్వేషణ పనులకు సింగరేణి సంస్థ సుమారు రూ.90 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇందులో రూ.20 కోట్లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది. సింగరేణి అందచేసే అన్వేషణ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ బ్లాక్‌‌ను కమర్షియల్ మైనింగ్ కోసం మరోసారి వేలం వేస్తుంది. ఆ వేలంలో సింగరేణి కాకుండా ఏ సంస్థ మైనింగ్ హక్కులు పొందినా ఆ గని జీవితకాలం మొత్తం వచ్చే రాయల్టీలో 37.75% వాటా ద్వారా రూ.వేల కోట్లు  సింగరేణికే దక్కనున్నది.