- 14 మందికి గాయాలు,
- ముగ్గురి పరిస్థితి విషమం
- మృతుల్లో ఐదుగురు మహిళలు
- ఆగి ఉన్న ఐరన్ లోడ్ లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
- హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా యాక్సిడెంట్
- మృతులంతా ఏపీ వాసులే
- అతివేగం, బస్సు డ్రైవర్ నిద్రమత్తే కారణమని భావిస్తున్న పోలీసులు
- ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద నేషనల్హైవే మీద ఆగి ఉన్న ఐరన్ లోడ్ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి తెనాలికి ఐరన్ రాడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని.. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఫ్రెష్ బస్ట్రావెల్స్కు చెందిన ఎలక్ట్రిక్ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది.
ద్వారకుంట వద్ద ముందు వెళ్తున్న వెహికల్‌ను ఓవర్ టెక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ రోడ్డుపై బారికేడ్లుగానీ, రెడ్ ఫ్లాగ్‌లుగానీ ఏర్పాటు చేయలేదు. దీంతోపాటు, ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంతో రోడ్డు మీద నిలిపి ఉన్న లారీని గమనించకుండా ఢీకొట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. బస్సు అతివేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో లారీలోని భారీ ఐరన్ రాడ్లు బస్సులోకి దూసుకుపోయాయి.
దీంతో బస్సు కుడివైపు డ్రైవర్ వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు తీవ్రగాయాలై వారిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ప్రయాణికులు ఇనుప రాడ్లు, బస్సు శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. రక్షాబంధన్ పండుగ పూట తోబుట్టువులకు రాఖీలు కట్టి, ఆనందంగా గడపాలన్న ఆశతో సొంతూళ్లకు బయలుదేరినవారు శవాలుగా మారడంతో వారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్న దృశ్యాలు ప్రతిఒక్కరినీ కన్నీళ్లు పెట్టించాయి.
గంటలో విజయవాడ వస్తుందనగా ప్రమాదం
ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలున్నారు. విజయవాడకు చెందిన లొల్లిపోగు మేరీ జ్యోత్స్న(39), భావన(25), పిడికిటి లక్ష్మి(31), ఎన్టీఆర్ జిల్లా తెల్లప్రోలుకు చెందిన యాసారపు చిన్ని(31), భీమవరానికి చెందిన షకీనా (24), కృష్ణా జిల్లా పడమటపల్లికి చెందిన చెన్నకేశవుల నాగేంద్రబాబు(31) మృతి చెందారు. వీరిలో ముగ్గురు యువతులు బెంగళూరులో సాఫ్ట్ వేర్ జాబ్స్ చేస్తున్నారు.
గాయపడిన వారిలో సీరియస్‌గా ఉన్న ముగ్గురిని ఖమ్మం, విజయవాడ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ జాబ్స్చేస్తున్నవారు, వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తున్నవారని పోలీసులు వెల్లడించారు. బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికుల్లో 21 మంది ఏలూరు, నలుగురు హనుమాన్ జంక్షన్, మిగిలిన వారు విజయవాడలో దిగాల్సి ఉంది. మరో గంటలో బస్సు విజయవాడకు చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
బస్సులో భయానక వాతావరణం
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కోదాడ పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాయపడినవారిని బస్సు నుంచి వెలికితీసి.. కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఏడుగురికి స్వల్పగాయాలు కాగా ట్రీట్మెంట్ చేసి పంపించారు. సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్, ఎస్పీ నరసింహ కోదాడ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని, అవసరమైతే స్పెషలిస్ట్‌లను పిలిపించాలని డాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలకు బంధువులకు అప్పగించారు.
ప్రమాదం జరిగిన బస్సులో భయానక వాతావరణం నెలకొంది. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో ఆ సమయంలో ఏమి జరిగిందో ఊహించలేకపోయారు. బస్సులో చిక్కుకున్నవారు తమను కాపాడాలంటూ కేకలు వేయడంతో అక్కడ పరిస్థితి ఆందోళన కలిగించింది. బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు, సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ఇనుపరాడ్లు, ధ్వంసమైన బస్సు భాగాల మధ్య చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు గంటకుపైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
పీఎం, సీఎంల దిగ్భ్రాంతి
ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పలువురు లీడర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఆఫీసర్లకు సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి కోదాడ, సూర్యాపేట హాస్పిటల్స్‌లో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
అన్నా.. రాఖీ కట్టేందుకు వస్తున్నా.. రెడీగా ఉండు..
విజయవాడకు చెందిన భావన బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వరుస సెలవులు రావడంతో రాఖీ పండుగ నాడు తన అన్నకు రాఖీ కట్టేందుకు సొంతూరుకు బయలుదేరారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి.. అక్కడి నుండి విజయవాడకు ప్రైవేట్బస్సులో బయలుదేరింది. ప్రయాణానికి ముందు కూడా తన అన్నతో వాట్సప్ కాల్ మాట్లాడిన భావన.. ఉదయం వరకు ఇంటికి వస్తా అని చెప్పింది. కానీ, ప్రమాదంలో ఐరన్ రాడ్డు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ‘రాఖీ కట్టడానికి వస్తున్నా.. రెడీగా ఉండు’ అని చెప్పిన చెల్లి చనిపోయిందన్నవార్త విన్న ఆమె అన్న కన్నీరుమున్నీరయ్యాడు.
కన్నా.. ఇంటికొస్తున్నా..
విజయవాడలోని తన పుట్టింట్లో ఉన్న కొడుకును చూసుకునేందుకు వెళ్తున్న బేలి పోగు మేరిజోత్స్న ప్రమాదంలో చనిపోయారు. రెండున్నర సంవత్సరాల కింద పెండ్లయిన ఆమెకు ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. అతన్ని విజయవాడలోని తన తల్లి దగ్గర ఉంచి.. మేరీ, ఆమె భర్త హైదరాబాద్‌లోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. వరుస సెలవులు రావడంతో కన్న కొడుకును చూసేందుకు బయలుదేరిన ఆమె కొద్దిసేపట్లో ఇంటికి చేరాల్సిఉండగా ప్రమాదంలో కన్నుమూశారు. దీంతో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తమ్ముడి పెండ్లికి వెళ్తూ..
హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న చెన్నకేశవుల నాగేంద్రబాబు తన బాబాయి కుమారుడి పెండ్లికి హాజరయ్యేందుకు వైజాగ్ బయలుదేరాడు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు సంతోషంగా బయలుదేరిన నాగేంద్ర బాబు.. ఊహించని రీతిలో బస్సు ప్రమాదంలో మృతి చెందాడు.
