- తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాలాంటి నేతల జోలికొస్తే సహించం
- నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాలి
- కొండా సురేఖ అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని కామెంట్
- డిప్యూటీ సీఎం భట్టితో భేటీ.. పెండింగ్ బిల్లుల కోసమే కలిశానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైందని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తన లాంటి నేతల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయా మీడియా సంస్థలు ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలన్నారు. బుధవారం ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి, బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మీడియా ఎక్కడున్నది, ఎవరికి సపోర్ట్ చేసిందో ప్రజలందరికీ బాగా తెలుసు. నిఖార్సైన తెలంగాణ నేతలను ఆంధ్రా మీడియా అడ్డుకోలేదు. నాపై కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. నేను తలుచుకుంటే వంద చానళ్లు పెడతా..’’ అని ఆయన పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో గొంతుక వినిపించిన నేతల పట్ల మీడియా అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు.
నిజాయతీగా ఉద్యమంలో పోరాడిన వ్యక్తులను కించపరిచేలా మీడియాలో కథనాలు రాయడం ఎంతవరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. ‘‘మాది అసలైన కాంగ్రెస్ రక్తం’’ అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనను విమర్శిస్తున్న వారి స్థాయి ఏంటో, వారు తనను ఎందుకు విమర్శిస్తున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో తాను ఒకడినని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశానని గుర్తుచేశారు.
2018 ఎన్నికల్లో పెద్ద పెద్ద లీడర్లు ఓటమిపాలైనా.. మునుగోడు ప్రజలు మాత్రం తనను గెలిపించారన్నారు. తెలంగాణ గురించి తాను ఎంతో పోరాడానని, తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. తాను వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డిని, ఇతర నాయకులెవరినీ విమర్శించలేదన్నారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంతో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరుగుతోందని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై, హైకమాండ్‌పై ఉందన్నారు.
బిల్లుల కోసమే భట్టిని కలిశాను..
తన నియోజకవర్గంలో పెండింగ్‌బిల్లుల కోసమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశానని, అంతేతప్ప తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తాను భట్టిని కలిసేందుకు ప్రజా భవన్‌లోకి వెళ్లిన సమయంలో అక్కడ కొండా మురళీ కనిపిస్తే పలకరించానని, అంతే తప్ప అక్కడ జరిగిన భేటీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కొండా సురేఖ అంశాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని, ఏఐసీసీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు.
