- ఈ ఏడాది మూడు ఘటనల్లో 24 మంది మృతి
- తెల్లవారుజామున 3 నుంచి 5.30 గంటల మధ్యే ఎక్కువ ప్రమాదాలు
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్‌ను ఢీకొనడంతో ఆరుగురు చనిపోయారు. దీంతో మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతపై చర్చ మొదలైంది. ఎక్కువ ట్రిప్పులు తిప్పాలనే యజమానుల కక్కుర్తి, డ్రైవర్లతో విరామం లేకుండా డ్యూటీలు చేయించడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. డ్రైవర్లకు సరైన విశ్రాంతి లేకపోవడంతో నిద్రమత్తులోకి జారుకుంటున్నారని అంటున్నారు. దీనికితోడు హైవేలపై రద్దీ తక్కువగా ఉండే సమయంలో బస్సులను అతివేగంగా నడుపుతున్నారని చెబుతున్నారు.
తెల్లవారుజామునే ఎక్కువ..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 5.30 గంటల మధ్యే జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో డ్రైవర్లకు నిద్ర ముంచుకొస్తుందని, హైవేలపై వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో వేగం పెంచుతారని అంటున్నారు. దీంతో చిన్నపాటి పొరపాటు జరిగినా ప్రమాదం తీవ్రంగా ఉంటుందని వివరిస్తున్నారు. ఈ ఏడాది ప్రైవేట్ ట్రావెల్స్‌కు సంబంధించి మూడు పెద్ద ప్రమాదాలు జరిగాయి. మార్చి 13న నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం వద్ద జాతీయ రహదారి-44పై మహారాష్ట్రలోని అకోలా వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. మార్చి 26న జగిత్యాల, నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏపీలోని మార్కాపురం వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం కాగా, 25 మంది గాయపడ్డారు. తాజాగా కోదాడ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ మూడు ఘటనల్లో కలిపి 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
రోడ్లపై ‘టెర్రర్’
ఇవే కాకుండా ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు ఢీకొని నిత్యం ఎక్కడో ఒకచోట ఒకరిద్దరు చనిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ వంటి రద్దీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. బస్సులు ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టడం, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేవారిని తొక్కేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. డ్రైవర్లకు అదనపు డ్యూటీలు వేయడం, వేగాన్ని నియంత్రించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల భద్రత కోసం డ్రైవర్లకు తగిన విశ్రాంతి, వేగ నియంత్రణ, నిబంధనల అమలుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
