- ఎస్ఏఎస్సీఐ పథకం కింద కేంద్రం రూ.202 కోట్ల సాయం
- ఒకే చోట 33 జిల్లాల విశిష్ట ఉత్పత్తులు, ఇతర రాష్ట్రాల స్టాళ్లు
- 2030 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని గడువు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కుటీర పరిశ్రమలు, చేనేత, హస్త కళల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని రాయదుర్గంలో తెలంగాణ ప్రభుత్వం ‘యూనిటీ మాల్’ను నిర్మించనుంది. కేంద్ర ప్రభుత్వ ‘స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్’ (ఎస్ఏఎస్సీఐ) పథకం కింద మంజూరైన నిధులతో ‘ఒకే జిల్లా -ఒకే ఉత్పత్తి’ (ఓడీఓపీ) కాన్సెప్ట్‌తో ఈ మాల్‌ను నిర్మిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గంలో టీజీ లిప్కోకు చెందిన 6.12 ఎకరాల స్థలాన్ని ఇందుకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉచిత హక్కులతో అధికారికంగా బదిలీ చేసింది. ఈ స్థలంలో దాదాపు 27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.2,059.81 కోట్ల అంచనా వ్యయంతో రెండు భారీ టవర్ల (ట్విన్ టవర్స్) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. తెలంగాణ వ్యాపార ప్రోత్సాహక సంస్థ (టీజీటీపీసీ) ఈ ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది. తెలంగాణలోని 33 జిల్లాల ప్రత్యేక ఉత్పత్తులతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల హస్తకళలు, సంప్రదాయ వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో స్థానిక చేతివృత్తుల కళాకారులకు ఐటీ హబ్ వేదికగా మార్కెట్ కల్పించాలని నిర్ణయించారు.
పీపీపీ విధానంలో..
ప్రాజెక్టు నిర్మాణాన్ని పబ్లిక్ -ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టేందుకు లావాదేవీల సలహాదారు సంస్థ ‘జేఎల్‌ఎల్’ నేతృత్వంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. లీడ్ మెంబర్‌గా ‘వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్’, మరో సభ్యునిగా ‘అపర్ణ ఇన్ఫ్రా-హౌసింగ్’ కన్సార్టియం ఈ కాంట్రాక్టును దక్కించుకోగా, ప్రభుత్వం లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేసింది. ఈ డెవలపర్లు ‘యూనిటీ మాల్ అండ్ స్పేసెస్ ఎల్ఎల్‌పీ’ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసి జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టు కోసం రూ.202 కోట్లు మంజూరు చేయగా, తొలి విడతగా రూ.101 కోట్లు విడుదల చేసింది. ఇందులో జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణ అనుమతుల ఫీజుల కోసమే రూ.60 కోట్లు చెల్లించగా, ఇప్పటివరకు మొత్తం రూ.83.24 కోట్లను పనుల నిమిత్తం ఖర్చు చేశారు. అందిన నిధుల్లో దాదాపు 80 శాతానికి పైగా ఖర్చు చేసినందున, యూసీలు సమర్పిస్తూ రెండో విడత నిధులు రూ.101 కోట్లు విడుదల చేయాలని టీజీటీపీసీ కేంద్రానికి లేఖ రాసింది. ఈ నిర్మాణాన్ని 2030 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
33 జిల్లాలు.. 33 ఉత్పత్తులు
ఈ యూనిటీ మాల్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించిన ‘ఒకే జిల్లా -ఒకే ఉత్పత్తి’ (ఓడీఓపీ) ప్రత్యేక విక్రయ కేంద్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఎంఎస్ఎంఈ స్టాళ్లు, మాల్స్ ఏర్పాటు కానున్నాయి. చేనేత, జౌళి, గిరిజన హస్తకళలు, సహజసిద్ధ వ్యవసాయ ఉత్పత్తుల తయారీదారులకు అంతర్జాతీయ స్థాయి ప్లాట్‌ఫారమ్ అందించేలా స్పేస్ కేటాయింపులు చేయనున్నారు. 27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ గ్యాలరీలు, అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు మల్టీపర్పస్ కాన్ఫరెన్స్ హాళ్లు, కొనుగోలుదారులు- విక్రేతల కోసం బిజినెస్ లాంజ్‌లు, ఫుడ్ కోర్టులు, అధునాతన లాజిస్టిక్స్ సదుపాయాలు సమకూర్చనున్నారు. ప్రధాన ఐటీ హబ్‌లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నందున ఐటీ నిపుణులు, స్వదేశీ, విదేశీ వాణిజ్య ప్రతినిధులు, పర్యాటకుల రాకపోకల ద్వారా స్థానిక ఉత్పత్తులకు భారీ డిమాండ్ లభించనుంది. ఫలితంగా దళారీ వ్యవస్థ ప్రమేయం లేకుండా చిన్న తరహా తయారీదారులు, గ్రామీణ చేతివృత్తుల కళాకారులు తమ వస్తువులను నేరుగా విక్రయించుకుని మెరుగైన ధర పొందే పారదర్శక వ్యాపార వేదిక అందుబాటులోకి వస్తుంది.
ఆర్థిక ప్రాధాన్యత.. ఉపాధికి భరోసా
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా పట్టణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థల మధ్య బలమైన అనుసంధానం ఏర్పడి, వేలాది మందికి స్థిరమైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యక్షంగా చూస్తే మాల్ నిర్వహణ, సేల్స్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ, స్టోర్ ఆపరేషన్స్, లాజిస్టిక్స్ విభాగాల్లో వేలాది మంది యువతకు ఉద్యోగాలు దక్కనున్నాయి. మరోవైపు, మాల్‌లోని స్టాళ్లకు నిరంతరం ఉత్పత్తులను సరఫరా చేయాల్సి ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని చేనేత సహకార సంఘాలు, డ్వాక్రా, నిర్మల్, బిద్రి వంటి సంప్రదాయ కళాకారులు, కుటీర పరిశ్రమలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాది పొడవునా ముడి సరుకు ఆర్డర్లు లభిస్తాయి. భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన విశిష్ట ఉత్పత్తుల మార్కెట్ విస్తరణకు, వాటి ఉత్పత్తి సామర్థ్యం పెరిగేందుకు ఈ కేంద్రం పనిచేయనుంది. కేవలం ఒక వాణిజ్య సముదాయంగానే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా చేతివృత్తులు, చిన్న పరిశ్రమలపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు నిరంతర ఆదాయ భద్రతను చేకూర్చే కీలకమైన ఆర్థిక వేదికగా ఈ మాల్ ఉపయోగపడుందని అధికారులు చెబుతున్నారు.
