- భోటేకోశీ నదికి ఫ్లాష్‌ఫ్లడ్స్.. 12 గ్రామాలు మునక
- భూకంపం, మంచు చరియలు విరిగిపడటంతో వరద
- పేకమేడల్లా కూలిన భవనాలు.. కొట్టుకుపోయిన బస్సులు, కార్లు
- తమిళనాడుకు చెందిన 50 మందికిపైగా గల్లంతు
- తెలంగాణ, కేరళ టూరిస్టులు సేఫ్
- ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది ఆచూకీ దొరకలే
- వరదలకు 6 జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం
- పలుచోట్ల అంధకారం.. రంగంలోకి నేపాల్ ఆర్మీ
- మోదీ దిగ్భ్రాంతి.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సాయం
- 157 మంది మృతి,750 మంది గల్లంతు
- గల్లంతైన భారతీయులు142
న్యూఢిల్లీ: హిమాలయ దేశం నేపాల్‌లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న భోటే కోశీ నది ఉధృతికి నువాకోట్, ధాదింగ్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. క్షణాల వ్యవధిలోనే వరద నీరు ముంచెత్తడంతో పలు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 157 మంది మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు.
భూకంపంతో సుమారు 17 వేల అడుగుల ఎత్తున ఉన్న గ్లేసియర్ నుంచి 2 వేల అడుగుల వెడల్పు గల భారీ మంచు దిమ్మె అకస్మాత్తుగా విరిగిపడింది. ఆ మంచు దిమ్మె దాదాపు 4 వేల అడుగుల లోతులోని లోయలోకి పడటంతో తీవ్ర ఒత్తిడి వల్ల మంచు, నీరు, రాళ్ల మిశ్రమంగా మారి ‘లెండె ఖోలా’, ‘భోటేకోశీ’ నదుల్లోకి ఉప్పొంగింది. ఈ ప్రవాహం దిగువనున్న గ్రామాలను ముంచెత్తింది.
టిబెట్‌లో పుట్టి నేపాల్‌లోని త్రిశూలి నదిలో కలిసే భోటే కోశీ నది ఉగ్రరూపం దాల్చడంతో టిమురే బజార్, రసువా సరిహద్దు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 12 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వరద ప్రవాహం క్రమంగా భారత్‌లోని గండక్ నది వైపు వెళ్తుండటంతో నదీ పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు.
750 మందికి పైగా గల్లంతు
వరద ఉధృతికి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 403 మంది టూరిస్టులు సహా 750 మందికి పైగా గల్లంతైనట్టు నేపాల్ వెల్లడించింది. టూరిస్టుల్లో 142 మంది ఇండియన్లు సహా 341 మంది విదేశీయులు, 93 మంది స్థానికులు ఉన్నారు. మరోవైపు, రసువా జిల్లాలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న 26 మంది నేపాల్ పోలీసులు, ఏడుగురు సాయుధ బలగాల సిబ్బంది కూడా వరదలో కొట్టుకుపోయారని సమాచారం.
టూరిస్టులంతా కైలాస మానససరోవర యాత్రకు వెళ్లారు. రసువాగఢీ సరిహద్దు గుండా టిబెట్‌లోకి ప్రవేశించేందుకు వివిధ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా చేరుకున్న ఈ బృందాలు.. వరద ధాటికి వంతెనలు, రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కొట్టుకుపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. నేపాల్ సైన్యం, విపత్తు బృందాలు హెలికాప్టర్ల ద్వారా గాలింపు, సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.
విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం
ఆకస్మిక వరదల కారణంగా నేపాల్ విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పరిధిలోని రసువాగఢీ, చిలిమే, త్రిశూలి 3ఏ, త్రిశూలి 3బీ హబ్ 220 కేవీ సబ్‌స్టేషన్, దేవీఘాట్ సహా 6 కీలక జలవిద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొండచరియలు విరిగిపడటం, వరద నీరు చేరడంతో ప్రధాన రహదారులన్నీ మూతపడి రవాణా వ్యవస్థ స్తంభించింది. విపత్తు తీవ్రత దృష్ట్యా నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది.
ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సమావేశం నిర్వహించి, రెడ్‌క్రాస్, వైద్య బృందాల సమన్వయంతో సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.
సహాయక చర్యలకు భారత వైమానిక దళం సిద్ధం
ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన పొరుగు దేశం నేపాల్‌కు అండగా నిలిచేందుకు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. కేంద్ర రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, నేపాల్‌లో సహాయక, రక్షణ చర్యలు చేపట్టేందుకు భారత్ భారీ ఎత్తున సహాయ సామాగ్రిని సిద్ధం చేస్తోంది. సహాయక సామాగ్రి, అత్యవసర మందులు, మట్టి తవ్వే యంత్రాలతో కూడిన ఐఏఎఫ్‌కి చెందిన సీ-130, సీ-17 రవాణా విమానాలను సిద్ధంగా ఉంచారు.
వీటిలో సీ-130 విమానం బయలుదేరింది. సీ-17 విమానం గురువారం మధ్యాహ్నం నేపాల్‌కు బయల్దేరనుంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) బృందాలను కూడా పంపేందుకు సిద్ధంగా ఉంచారు. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోన్లో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారతదేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
తమిళనాడుకు చెందిన 50 మందికి పైగా గల్లంతు
కైలాస మానససరోవర యాత్రికులు ప్రయాణించే నేపాల్–-టిబెట్ సరిహద్దు కారిడార్‌లో సంభవించిన ఆకస్మిక మెరుపు వరదల కారణంగా సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బుధవారం రాత్రి సమయానికి తమిళనాడుకు చెందిన కనీసం 50 మందికి పైగా టూరిస్టుల ఆచూకీ తెలియరాలేదు. ఉదయం 9 గంటల సమయంలో టిబెట్ వైపు నుంచి భోటే కోశీ నదిలోకి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నేపాల్‌లోని రసువా ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది.
4 ట్రావెల్ ఏజెన్సీల ద్వారా తమిళనాడు నుంచి మొత్తం 106 మంది యాత్రికులు (నాలుగు గ్రూపులుగా) వెళ్లారు. ఆగస్టు 23న కుంభకోణం ఆపరేటర్ ద్వారా 57 మంది, చెన్నై నుంచి 49 మంది బయలుదేరారు. వీరిలో రెండు గ్రూపులు క్షేమంగా ఉన్నాయని, మిగిలిన రెండు గ్రూపులతో సంబంధాలు తెగిపోయాయని టూర్ కోఆర్డినేటర్ తెన్నరసు తెలిపారు.
కాగా, వరదల్లో చిక్కుకున్న తమిళనాడుకు చెందిన టూరిస్టులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు చెన్నై సెంట్రల్ ఎంపీ దయానిధి మారన్ లేఖ రాశారు. బాధితులను క్షేమంగా తీసుకురావడంతో పాటు నేపాల్‌కు అవసరమైన సహాయం అందించాలని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రాందాస్ కేంద్రాన్ని కోరారు.
ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది..
నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన మెరుపు వరదల్లో కైలాస మానససరోవర యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులు చిక్కుకున్నారు. చైనా– నేపాల్ సరిహద్దుల్లోని గైరాంగ్ వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద వరద ముంచెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వివరాలను ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వయంగా వెల్లడించారు.
గైరాంగ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉన్న 77 మంది యాత్రికులు, నేపాల్‌లోని తిమురే వద్ద ఉన్న ముగ్గురు వలంటీర్ల వివరాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. యాత్రలో పాల్గొన్న మొత్తం 21 గ్రూపుల్లో 495 మంది ఇప్పటికే సురక్షితంగా వెనక్కి వచ్చారు. మిగిలిన వారిలో 743 మంది టిబెట్‌లో, 148 మంది నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సురక్షితంగా ఉన్నట్లు ఫౌండేషన్ తెలిపింది.
భూంకంపం, విరిగిపడ్డ మంచు చరియల వల్లే..
నేపాల్ వరద విపత్తుకు మంచు చరియలు విరిగిపడడం, గ్లేసియల్ సరస్సు బద్ధలవడం, భూకంప ప్రభావం కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నేపాల్ వైపు నుంచి భారీగా మంచు చరియలు విరిగి లెండే ఖోలా నదిలో పడటంతో నీటి ప్రవాహం నిలిచిపోయి, ఆ తర్వాత ఒక్కసారిగా ఉప్పొంగి కిందకు దూసుకువచ్చి ఉండవచ్చని ఖాట్మండు యూనివర్సిటీ ప్రొఫెసర్ రిజన్ భక్త కాయస్థ తెలిపారు. వరద ముంచెత్తడానికి కొద్ది నిమిషాల ముందు (ఉదయం 8:37 గంటలకు) టిబెట్ భూభాగంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే, జర్మన్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించాయి.
భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్
నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికులకు సాయం, సమాచారం అందించేందుకు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. సమాచారం, సహాయం కోసం సెల్: +977 985 131 6807 , సెల్ +977 970 910 7500 సంప్రదించాలని ఇండియన్ ఎంబసీ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులు ఈ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది.
హైదరాబాద్ టూరిస్టులు సేఫ్..!
నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన టూరిస్టులు అంతా సురక్షితంగా ఉన్నారని సమాచారం. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా 153 నుంచి 156 మంది నేపాల్ వెళ్లినట్టు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు సిటీ పోలీసులు టూరిస్టుల వివరాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన వారంతా సురక్షితంగానే ఉన్నట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే ఆయా కుటుంబాలను సంప్రదించేందుకు సిటీ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని హైదరాబాద్ తరలించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. టూరిస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు గురువారం లభించే అవకాశం ఉందని సీపీ సజ్జనార్ తెలిపారు. నేపాల్‌లో ఉన్న తెలంగాణకు చెందిన యాత్రికులు, పర్యాటకులు లేదా ఇతర వ్యక్తులతో సంప్రదింపులు జరపలేకపోతున్న కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.
9871999044, 9949351270, 9618597969లో సంప్రదించాలని అధికారులు సూచించారు. కాగా, ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన కేరళకు చెందిన 36 మంది టూరిస్టుల బృందం సురక్షితంగా ఉన్నట్టు సమాచారం అందింది. కేరళ ప్రభుత్వం, ప్రవాస కేరళీయుల వ్యవహారాల శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాయి.
ప్రమాదం ఎలా ..!
- ఉదయం 8:37 గంటలకు భూకంపం
- నేపాల్–టిబెట్ బార్డర్లో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం, రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇవి హిమాలయ పర్వతాలను కుదిపేశాయి.
- భూకంప ప్రభావంతో హిమానీనదం నుంచి భారీ స్థాయిలో మంచు, రాళ్లు విరిగిపడి ఇరుకైన ‘లెండె ఖోలా’ లోయలోకి జారాయి.
- కొండచరియలు, మంచు వ్యర్థాలు లెండె ఖోలా నదికి అడ్డంగా తాత్కాలిక డ్యామ్లా ఏర్పడి, వెనుక భారీగా నీరు చేరింది.
- నీటి ఒత్తిడి తట్టుకోలేక ఆ తాత్కాలిక మంచు డ్యామ్ తెగిపోయింది. దాంతో నీరు, మట్టి, మంచు కలగలిసి ప్రచండ వేగంతో దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చాయి.
- ఉదయం 9:00 గంటలకు విధ్వంసం..
- ఈ ఉధృత ప్రవాహం భోటేకోశీ కారిడార్ గుండా ప్రవహించి రసువాగధి సరిహద్దు, తిమురే, స్యాబ్రుబేసి మీదుగా త్రిశూలి నది వైపు దూసుకెళ్లింది. ఈ ధాటికి పలు వంతెనలు, రోడ్లు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. అటు చైనా వైపు ఉన్న గైరాంగ్ పోర్ట్ ప్రాంతంలోనూ బురద ప్రవాహాలు సంభవించాయి.
- ఈ లోయ ఎందుకు
- తీవ్ర ప్రమాదానికి గురైంది?
- భౌగోళిక నిర్మాణం: లోయలు ఎంతో లోతుగా, ఇరుగ్గా ఉండటం వల్ల ప్రవాహం క్షణాల్లో ఉధృతంగా మారుతుంది.
- గ్లేసియర్ల అస్థిరత: పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల హిమాలయాల్లోని మంచు గడ్డలు బలహీనపడి, సులభంగా విరిగిపడుతున్నాయి.
- ముందస్తు హెచ్చరిక లేకపోవడం: స్థానికంగా వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు వరద ముప్పును ఊహించలేకపోయారు.
- గత చరిత్ర: దాదాపు 14 నెలల క్రితం ఇదే నదిలో ఇలాంటి వరదలు రావడం వల్ల తీర ప్రాంతాలు ముందే బలహీనపడి ఉన్నాయి.
