- సాగర్‌పై ఏపీ దౌర్జన్యం
- కుడి కాల్వ నుంచి 2 వేల క్యూసెక్కుల తరలింపు
- బోర్డుకు సమాచారం ఇవ్వకుండానే ఏపీ తొండాట
- అదే స్థాయిలో సమాధానం చెప్పిన తెలంగాణ
- ఎడమ కాల్వ నుంచి 2 వేల క్యూసెక్కులు రిలీజ్
- రాష్ట్రాల మధ్య వాటర్ వార్.. రంగంలోకి సీఆర్‌పీఎఫ్
- శ్రీశైలం, తుంగభద్ర, సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ
- బోర్డుకు ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ ఆఫీసర్లు
- లెక్కలు తేలకుండానే నీటి తరలింపుపై ఆగ్రహం
హైదరాబాద్/హాలియా, వెలుగు: కృష్ణా నీళ్లపై ఏపీ దౌర్జన్యం చేస్తున్నది. తెలంగాణ అధీనంలో ఉండాల్సిన సాగర్ ప్రాజెక్టులో సగ భాగాన్ని చెరబట్టిన పొరుగు రాష్ట్రం.. తనకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు గేట్లు లేపి నీటిని తరలిస్తున్నది. బుధవారం ఏకపక్షంగా సాగర్ కుడి కాల్వ గేట్లు లేపి 2 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నది. ఏటా నీటి వాటాలు, వినియోగానికి సంబంధించి కృష్ణా బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సోమవారం రెండు రాష్ట్రాల నీటి అవసరాలపై త్రీమెంబర్ కమిటీ మీటింగ్ నిర్వహించినా.. ఎటూ తేలకుండా ముగిసిపోయింది. ఇదే అదునుగా భావించిన ఏపీ.. కృష్ణా బోర్డుకుగానీ, మనకుగానీ సమాచారం ఇవ్వకుండానే కుడి కాల్వ నుంచి నీటిని వదిలింది. దీనిపై తమ అభ్యంతరం తెలిపిన తెలంగాణ అధికారులు కూడా ఎడమ కాల్వ నుంచి ఒక గేటెత్తి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
గతంలోనూ సాగర్ ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనగా.. ఇప్పుడు ఎల్‌నినో కరువు పరిస్థితుల్లోనూ అది మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పరిస్థితి చేయిదాటిపోకుండా ముందు జాగ్రత్త చర్యగా డ్యామ్‌పై సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు. ఏపీ తీరుపై బోర్డుకు మన అధికారులు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
అక్కడా.. ఇక్కడా.. దోపిడీనే..
నీళ్ల విషయంలో ఏపీ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. చిన్న సందు దొరికితే చాలు పెద్ద ఎత్తున నీటిని తన్నుకుపోతున్నది. ఇప్పటికే శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్‌ను విచ్చలవిడిగా తోడేసుకుంటున్నది. పోతిరెడ్డిపాడు నుంచి 10 వేల క్యూసెక్కుల జలాలను తీసుకుపోతున్నది. మరో నాలుగైదు రోజుల్లో వెలిగొండ టన్నెల్‌ను ప్రారంభించి శ్రీశైలానికి ఇంకో గండి కొట్టబోతున్నది. మనకే కాకుండా.. అటు కర్నాటకకూ ఏపీ చుక్కలు చూపిస్తున్నది. తుంగభద్ర లో లెవెల్ కెనాల్ నుంచీ ఇష్టారాజ్యంగా జలాలను వాడుకుంటున్నది. దీంతో కడుపుమండిన కర్నాటక రైతులు.. కొద్ది రోజుల కింద ఏపీ నీళ్లు మళ్లిస్తున్న లో లెవెల్ కెనాల్ వద్దకు వచ్చి దిగువకు నీళ్లు వెళ్లకుండా అడ్డుకట్టలు వేశారు. తమ పొలాలకు నీళ్లందకుండా.. ఏపీ వాళ్లు మొత్తం తోడేసుకుంటున్నారని కర్నాటక రైతులు ఆరోపించారు. అదేసమయంలో ఇక్కడ శ్రీశైలం నుంచి తాగునీటికోసమని చెప్పి సాగు అవసరాలకు ఏపీ మళ్లిస్తున్నది. మరోవైపు మనకున్న సోర్సు నాగార్జున సాగర్ నుంచి నీటిని వాడుకునేందుకు వీలుగా.. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా సాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని వదులుతుంటే మాత్రం ఏపీ అడ్డుపుల్లలు వేస్తున్నది. విద్యుదుత్పత్తి చేయొద్దంటూ ఫిర్యాదులు చేస్తున్నది. ఓవైపు విద్యుదుత్పత్తి చేయొద్దంటూ.. సాగర్‌కు నీళ్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ.. తీరా సాగర్‌లోకి వస్తున్న నీళ్లనూ ఇప్పుడు మళ్లిస్తున్నది. అలా మూణ్నాలుగు సోర్సుల ద్వారా ఏపీ జల దోపిడీకి పాల్పడుతున్నది.
త్రీ మెంబర్ కమిటీలో తేల్చకుండానే..
రెండు రాష్ట్రాల నీటి వినియోగానికి సంబంధించి సోమవారం కృష్ణా బోర్డు త్రీ మెంబర్ కమిటీ మీటింగ్నిర్వహించింది. ఆ సమావేశంలోనూ ఏపీ వితండవాదనలు చేసింది. మనకు నీళ్లు లేవంటూ వాదించింది. 71 శాతం నీళ్లను తమకే ఇవ్వాలని పట్టుబట్టింది. తెలంగాణకు కేవలం 30 టీఎంసీలే ఉన్నాయంటూ వాదనలకు దిగింది. శ్రీశైలం నుంచి జలవిద్యుదుత్పత్తి కూడా చేయొద్దంటూ బోర్డుకు చెప్పుకొచ్చింది. అక్టోబర్ నాటికే 47 టీఎంసీలు కావాలని డిమాండ్చేసింది. దానికి మన అధికారులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఏపీకి అన్ని నీళ్లే లేవని, సగం సగం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అక్టోబర్ వరకు ఏపీకి ఎన్ని నీళ్లిస్తే అన్ని నీళ్లు తమకూ ఇవ్వాలని తేల్చి చెప్పారు. తమకు 70 శాతం నీళ్లొస్తాయని, కానీ ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా సగం సగం వాటాకు ఒప్పుకుంటున్నామని స్పష్టం చేసింది. దీనిపై రెండు రాష్ట్రాలూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సెప్టెంబర్ 4కు మీటింగ్ వాయిదా పడింది. ఆ సమావేశంలో పూర్తి ఇండెంట్లతో రావాలని రెండు రాష్ట్రాలకు బోర్డు చెప్పింది. ఈ క్రమంలోనే మీటింగ్‌లో ఎవరికి ఎన్ని నీళ్లివ్వాలో తేల్చాల్సి ఉన్నా.. ఏపీ మాత్రం ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నీళ్లు దోచుకెళ్లిపోతున్నది.
ఇన్‌ఫ్లోస్ రావట్లే..
కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహాలు తగ్గిపోయాయి. మళ్లీ ఎప్పుడు ఊపందుకుంటాయన్నదీ తెలియని పరిస్థితి. ఉన్న ప్రాజెక్టుల్లో శ్రీశైలంలోనే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. సాగర్ ప్రాజెక్టులోకి ఒక్కసారి కూడా భారీ వరద వచ్చింది లేదు. ఇలాంటి ఎల్‌నినో టైంలో నీటిని చూసి జాగ్రత్తగా వాడుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు. అయినా కూడా సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ నీటిని తోడేయడం వివాదాలకు తావిచ్చింది. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో 590 అడుగులకుగానూ.. 536.40 అడుగుల వద్ద నీళ్లున్నాయి. పూర్తి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకుగానూ.. 181 టీఎంసీల నిల్వ ఉంది. డ్యామ్‌కు శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి ద్వారా 22 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోస్ వస్తున్నాయి. ఎస్ఎల్బీసీ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తుండగా.. ఎడమ కాలువ నుంచి కూడా ప్రస్తుతం నీటి విడుదల కొనసాగుతున్నది. నాలుగు రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని, ఈ నీళ్లను తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు. సాగునీటి కోసం కాలువ తూములు తెరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటు ఏపీ నీటి వినియోగంతో శ్రీశైలంలోనూ నీటి మట్టం తగ్గిపోతున్నది. 215.81 టీఎంసీలకుగానూ.. 163 టీఎంసీల జలాలున్నాయి. ప్రాజెక్టుకు ప్రస్తుతం 15 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది.
