భారతదేశంలో చట్టాలు, న్యాయం ఒక్కొక్కరికీ ఒక్కోలా పనిచేస్తున్నాయా? ఈ ప్రశ్న లేవనెత్తింది ఎవరో కాదు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా. అవును ప్రస్తుతం ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. తాను చెల్లించాల్సిన రూ. 6వేల 203 కోట్ల అప్పు కంటే అధికంగా రూ.14వేల 100 కోట్లను వసూలు చేశారన్నారు. అంటే అప్పు కంటే డబుల్ పేమెంట్ బ్యాంకులు, ప్రభుత్వం రికవరీ చేసుకున్నాయని మాల్యా పేర్కొన్నారు. అయినప్పటికీ దేశంలో చాలామంది బకాయిదారులు మాత్రం తమ అప్పులను అతి తక్కువ భారాన్ని చెల్లించి సెటిల్ చేసుకుంటున్నారని, ఇదేనా భారతీయ రుణ పరిష్కార వ్యవస్థ అందించే న్యాయం? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ అంశంపై మీడియా కూడా మౌనం వహించడం గమనార్హం అంటూ తన పోస్టులో రాశారు మాల్యా.
వాస్తవానికి జీ మీడియా అధినేత సుభాష్ చంద్ర దివాలా వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(NCLT) ఇచ్చిన సంచలన తీర్పును మాల్యా తన పోస్టులో పరోక్షంగా ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపారు. సుభాష్ చంద్రకు సంబంధించిన సుమారు రూ.22 వేల కోట్ల అప్పులను కేవలం రూ.6కోట్ల 50 లక్షలకు సెటిల్ చేసుకోవడానికి ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కార్పొరేట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి సంస్థలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా, మెజారిటీ క్రెడిటర్ల ఆమోదం పేరుతో కోట్ల అప్పు లక్షల్లో తీరిపోవడంపై మాల్యా తనదైన శైలిలో స్పందించారు.
If True many congratulations to my friend Subhash.Banks and Government have admitted having recovered Rs 14,100 crores from me against a Judgement debt of Rs 6203 crores. Many more borrowers have settled at a fraction. Indian Debt Resolution Justice I presume. No media questions. pic.twitter.com/5uwxYSAX8H
— Vijay Mallya (@TheVijayMallya) August 26, 2026
ఈ రెండు కేసులను బేరీజు వేస్తే భారతదేశంలో న్యాయ వ్యవస్థలోని వైరుధ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు తన విషయంలో అప్పు కంటే రెట్టింపు మొత్తాన్ని రాబట్టుకున్నా ఇంకా వేధింపులు కొనసాగుతున్నాయని మాల్యా ఆవేదన వ్యక్తం చేయగా.. మరోవైపు జీ మీడియా అధినేత వేల కోట్ల అప్పులు నామమాత్రపు మొత్తానికి సెటిల్ కావడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సంపన్నులకు, సాధారణ దివాళాదారులకు, అలాగే పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులకు చట్టాల అమలులో ఉన్న లొసుగులను ఈ పరిణామాలు మరోసారి తెరపైకి తెచ్చాయి. మొత్తానికి మాల్యా చేసిన ఈ కామెంట్లు దేశ ఆర్థిక నిపుణులతో పాటు సామాన్యులను కూడా ఆలోచింపజేస్తున్నాయి.
U should have bought media or atleast paid their supari
— Cheatedbuyers (@Cheatedbuyer) August 27, 2026
మాల్యా పోస్టుపై స్పందించిన నెటిజన్లు.. దేశంలో వ్యవస్థ తీరుతెన్నులను ఎద్దేవా చేశారు. సాధారణ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ఫెయిల్ అయితే వారిపై కొరడాఝుళిపించే సిస్టమ్, పెద్దల విషయంలో మాత్రం నిబంధనలను సడలిస్తుందని కొందరు మండిపడ్డారు. "అసలు మీడియా సంస్థలను కొనుగోలు చేయలేకపోయారా, లేక కనీసం సూపారీ ఇవ్వలేకపోయారా?" అంటూ కొందరు వ్యంగ్యంగా స్పందించగా.. రాజకీయ అండదండలు లేకపోవడం వల్లే మాల్యాకు ఈ పరిస్థితి వచ్చిందని, కొందరు మాత్రం ఈ వ్యవస్థలో సామాన్యుడికి, శక్తిమంతులకు మధ్య చట్టం వేర్వేరుగా పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యాపారంలో నష్టపోవడం నేరం కానప్పటికీ.. న్యాయ వ్యవస్థలో లొసుగులు పక్షపాత ధోరణి వల్ల ఒక్కో వ్యక్తికి ఒక్కోలా శిక్షలు, సెటిల్‌మెంట్లు ఉంటున్నాయని నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
We live in strange times, where a ‘fugitive’ from India seems more believable and trustworthy than the entire system here. Failing in business is not a crime, and most Indians still have fond memories of Kingfisher Airlines (nothing compares in the domenstic airline market…
— Dr. Rajat R MD, DM (@TheRajatRawat) August 27, 2026
