AFG vs IND: భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ మైదానంలో కంటే ముందే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సిరీస్ కోసం ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డ్ (ACB) గ్లోబల్ మీడియా రైట్స్ బాధ్యతలను పాకిస్థాన్‌కు చెందిన ట్రాన్స్‌గ్రూప్ (TransGroup) సంస్థకు అప్పగించింది. ఈ కంపెనీకి పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL), పీసీబీ (PCB) లతో నేరుగా అనుబంధం ఉంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతదేశంలోనే జరగనున్నప్పటికీ, ఈ సిరీస్ అధికారిక హోస్టింగ్ హక్కులు మాత్రం ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు వద్దే ఉన్నాయి.
హక్కుల పంపిణీ.. ఎవరికి ఏ బాధ్యతలు?:
* గ్లోబల్ మీడియా రైట్స్ సైండికేషన్ పార్ట్‌నర్: ట్రాన్స్‌గ్రూప్ (TransGroup - పాకిస్థాన్ సంస్థ)
* మీడియా ప్రొడక్షన్ పార్ట్‌నర్: TPT360
* భారత్‌లో అఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్: ఫ్యాన్‌కోడ్ (FanCode)
* అఫీషియల్ డ్రెస్ పార్ట్‌నర్: వానీ (Vany)
భారత్– ఆఫ్ఘన్ టీ20 షెడ్యూల్:
తమ సొంత దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న క్రికెట్ మైదానాలు లేకపోవడంతో ఆఫ్ఘనిస్థాన్ బోర్డు తరచూ భారత్ లేదా యూఏఈ వేదికలుగా తమ హోమ్ సిరీస్‌లను నిర్వహిస్తోంది. జూన్‌లోనే ఆఫ్ఘన్ జట్టు భారత్‌లో పర్యటించి ఒక టెస్టు, 3 వన్డేలు ఆడింది. ధర్మశాల, లక్నో, చెన్నైలలో జరిగిన ఆ వన్డే సిరీస్‌ను భారత్ 3–0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ 13వ తేదీ నుంచి జరగబోయే టీ20లకి ఆఫ్ఘనిస్తాన్ ఆథిత్యం ఇవ్వబోతుంది.
* సెప్టెంబర్ 13: మొదటి టీ20
* సెప్టెంబర్ 15: రెండో టీ20
* సెప్టెంబర్ 17: మూడో టీ20
2024లో డబుల్ సూపర్ ఓవర్:
భారత్– ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య చివరిసారిగా జనవరి 2024లో టీ20 సిరీస్ జరిగింది. ఆ సిరీస్‌ను భారత్ 3–0తో కైవసం చేసుకుంది. బెంగళూరులో జరిగిన చివరి మ్యాచ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. రెండు జట్లు సరిగ్గా 212 పరుగులు సాధించడంతో మ్యాచ్ టై అయి, ఏకంగా డబుల్ సూపర్ ఓవర్ (Double Super Over) వరకు వెళ్లి చివరకు టీమిండియాను విజేతగా నిలిపింది. ఈ సిరీస్ ద్వారా ఆఫ్ఘనిస్థాన్ భారత నేలపై ఎలా పోరాడుతుందో చూడాల్సి ఉంది.
