హనుమకొండ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎన్జీవోల ధర్నాలో పాల్గొన్న హరీశ్ రావు కలెక్టరేట్ నుంచి పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకుని, హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
టీఎన్జీవోల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఈ నిరసనలో హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే 15 శాతం కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా పాలన అంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవాలంటే కనీసం సెల్ ఫోన్‌ను కూడా అనుమతించడం లేదని మండిపడ్డారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కినా సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకులను విజిలెన్స్, ఏసీబీ కేసులతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, రేవంత్ రెడ్డి నాయకులను బెదిరించవచ్చు కానీ లక్షలాది మంది ఉద్యోగులను అణచివేయలేరని హెచ్చరించారు.
ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హరీశ్ రావు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ తరఫున గళం వినిపిస్తామని, వారి గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
