Raksha Bandhan 2026: అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, రక్షణబంధానికి ప్రతీకగా నిలిచే ఏకైక పండుగ రక్షాబంధన్. శ్రావణ పౌర్ణమి నాటి ఈ పండుగ రోజున ప్రతీ ఇంట్లోనూ సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. అక్కచెల్లెళ్లు తమ సోదరుల క్షేమాన్ని, ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ వారికి రాఖీ కడితే.. అన్నదమ్ములు తమ సోదరీమణులకు ఆజన్మాంతం అండగా ఉంటామని మాట ఇస్తారు. కానీ, ఈ పండుగ రోజున కేవలం రాఖీ కట్టేసి స్వీట్ తినిపించడమే కాకుండా.. మన శాస్త్రాలు, ధర్మ సూత్రాల ప్రకారం కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం. నిబంధనలకు లోబడి సరైన పద్ధతిలో రాఖీ కట్టినప్పుడే ఆ సోదర బంధానికి సంపూర్ణమైన శుభ ఫలితాలు, దైవానుగ్రహం దక్కుతాయి. అందుకే ఈ రాఖీ పండుగ నాడు పాటించాల్సిన ఆ ముఖ్యమైన నియమాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రాఖీ కట్టేందుకు సరైన ముహూర్తం, పద్దతి:
* శుభ ముహూర్తం: రాహుకాలం, భద్ర కాలం లాంటి అశుభ సమయాలను పూర్తిగా వదిలి పెట్టి, శుభ ముహూర్తంలో మాత్రమే రాఖీ కట్టాలి. భద్ర కాలంలో రాఖీ కట్టడం వల్ల అశుభాలు జరుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
* సరైన దిశ: రాఖీ కట్టించుకునే సోదరుడు తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి కూర్చోవాలి.. దక్షిణం (యమ దిశ) వైపు ముఖం పెట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ కూర్చోకూడదు.
* కుడి చేయి మాత్రమే: ఎప్పుడూ కూడా సోదరుడి కుడి చేతి మణికట్టుపైనే రాఖీ కట్టాలి. ఎడమ చేతికి కట్టడం వల్ల శాస్త్రీయంగా సరైన ఫలితం దక్కదు.
* తల కప్పుకోవడం: రాఖీ కట్టే సమయంలో, కట్టించుకునేటప్పుడు ఇద్దరూ తలపై రుమాలు లేదా వస్త్రం ఉంచుకోవడం (తల కప్పుకోవడం) చాలా ముఖ్యమైంది.
ALSO READ : రాశి ప్రకారం రాఖీ బహుమానం.. 12 రాశుల్లో ఎవరికి ఏది బెస్ట్ గిఫ్ట్
రాఖీ కట్టడం వలన కలిగే దైవానుగ్రహం:
* పూజా థాలి సిద్ధం: పూజా థాలి (పల్లెం)లో రాఖీ, కుంకుమ, అక్షింతలు, వెలిగించిన దీపం, మిఠాయిలు, నీటి పాత్రను సిద్ధంగా పెట్టుకోవాలి.
* దేవుడికి మొదటి రాఖీ: సోదరుడికి రాఖీ కట్టడానికి కంటే ముందుగా పూజా థాలిలోని తొలి రాఖీని విఘ్నేశ్వరుడికి (గణపతికి) లేదా మీ ఇష్ట దైవానికి సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి.
* హారతి: రాఖీ కట్టడానికి ముందు సోదరుడికి హారతి ఇచ్చి దిష్టి తీయాలి.. ఆ తర్వాత నుదుటిన కుంకుమ తిలకం దిద్ది, తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించాలి.
రాఖీ ఎన్ని ముడులు కట్టాలి, ఏ కలర్ రాఖీ తీసుకోవాలంటే:
* మూడు ముడులు: రాఖీ కట్టేటప్పుడు దారానికి సాంప్రదాయబద్ధంగా మూడు ముడులు వేయడం శుభప్రదం. ఇవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీస్సులకు, త్రిగుణాలకు ప్రతీకగా చెబుతారు.
* రాఖీ రంగులు: పసుపు, ఎరుపు, గులాబీ రంగు దారాలు లేదా ఓం, స్వస్తిక్ గుర్తులు ఉన్న రాఖీలను మాత్రమే తీసుకోవాలి.. నలుపు రంగు రాఖీలను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ సోదరులకి కట్టొద్దు.
* ఈ బహుమతులని ఇవ్వొద్దు: సోదరులు తమ సోదరీమణులకు గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు కత్తెర, చాకులు, పదునైన వస్తువులు లేదా నల్లటి దుస్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు.
* ఈ రక్షాబంధన్ పండుగ నాడు ఈ చిన్న చిన్న ధర్మ సూత్రాలను పక్కాగా పాటిస్తూ పండుగ చేసుకుంటే.. అన్నాచెల్లెళ్ల బంధం మరింత గట్టిపడటమే కాకుండా ఇరు కుటుంబాల్లోనూ నిత్యం సంతోషం, డబ్బు సమృద్ధిగా ఉంటుందని మన శాస్త్రల్లో ఉంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమె. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
