మీకు సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు లేరా..? అయితే రాఖీ ఎవరికి కట్టాలి ? ఏం చేయాలో తెలుసా?

మీకు సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు లేరా..? అయితే రాఖీ ఎవరికి కట్టాలి ? ఏం చేయాలో తెలుసా?

ఈ రాఖి పండగకి సొంత అన్నదమ్ములు లేదా అక్కచెల్లెళ్లు లేరని అస్సలు దిగులు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే రాఖీ అనేది కేవలం రక్త సంబంధాలకు మాత్రమే పరిమితమైన పండుగ కాదు.. అది మనల్ని రక్షించే ప్రతి ప్రేమ బంధానికి ఇచ్చే గౌరవం. మీకు సొంత అన్నదమ్ములు లేకపోయినా, ఈ రక్షా బంధన్ 2026 (ఆగస్టు 28) రోజున మీ చేతి మణికట్టు ఖాళీగా ఉండకుండా పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవడానికి 4 అద్భుతమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి.....

1. శ్రీకృష్ణుడు మీ అన్నయ్యగా 
మీకు సొంత అన్నదమ్ములు లేకపోతే బాధపడకండి. ఇంట్లో  శ్రీకృష్ణుడి  విగ్రహానికి లేదా ఫోటోకు రాఖీ కట్టొచ్చు.  అవును... పురాణాల ప్రకారం రాఖీ పండుగ వెనుక ఉన్న ముఖ్యమైన కథ శ్రీకృష్ణుడు, ద్రౌపదిలదే. సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుడి వేలు తెగి రక్తం కారుతుంటే, ద్రౌపది తన చీర కొంగును చింపి ఆయన వేలికి కట్టింది. ఆ రోజు నుండి, శ్రీకృష్ణుడు ద్రౌపదిని తన సోదరిగా భావించి..  ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు ఆమెను రక్షించి  కాపాడాడు.  


2. అబ్బాయిలు లక్ష్మీదేవికి రక్షా సూత్రం 
సొంత అక్క లేదా చెల్లెలు లేని అబ్బాయిలు లక్ష్మీదేవిని సొంత సోదరిగా భావించవచ్చు. పూజ చేసుకునే సమయంలో ముందుగా అమ్మవారి పాదాల దగ్గర ఒక కొత్త రాఖీని పెట్టి పూజించండి. పూజ పూర్తయిన తర్వాత, అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తూ ఆ రాఖీని మీ మణికట్టుకు కట్టుకోండి.

3. తల్లిదండ్రుల కంటే గొప్ప రక్షకులు లేరు 
మనకు ఏ కష్టం వచ్చినా ముందుగా నిలబడేది తల్లిదండ్రులే. ఒకవేళ మీరు బంధువులకు దూరంగా ఉన్నా, సొంత తోబుట్టువులు లేకపోయినా ఈ పండుగను తల్లిదండ్రులతో జరుపుకోండి. అమ్మాయిలు తండ్రికి రాఖీ కట్టవచ్చు, అబ్బాయిలకు  తల్లికి  కట్టవచ్చు. మన జీవితంలో మనల్ని నిరంతరం రక్షించేది వాళ్లే కదా. 

ALSO READ : రాఖీ కట్టే సమయంలో పాటించాల్సిన నియమాలు, ధర్మ సూత్రాలు ఇవే..

4. మనస్ఫూర్తిగా ఆదుకునే స్నేహితులు 
కొన్నిసార్లు రక్తసంబంధికులు లేకపోయినా మన కష్టసుఖాల్లో తోడుండే స్నేహితులు, పక్కింటి వాళ్ళు మనకు సొంత మనుషుల కంటే ఎక్కువ అవుతారు. మీకు ఏ అవసరం వచ్చినా "నేనున్నాను" అని ధైర్యం చెప్పే మంచి స్నేహితుడికి లేదా పొరుగువారికి రాఖీ కట్టి ఈ పండుగను జరుపుకోండి.