కిలో ఉల్లి 60 రూపాయలా.. ఏంటి బాసూ.. నిన్నా మొన్నా 30కే ఇచ్చారుగా..!

కిలో ఉల్లి 60 రూపాయలా.. ఏంటి బాసూ.. నిన్నా మొన్నా 30కే ఇచ్చారుగా..!

ఏంటీ కిలో ఉల్లి 60 రూపాయలా.. నిన్నా మొన్నా ఇటు వెళుతూ బోర్డు చూశాను.. వంద రూపాయలకు 3 కిలోలు అన్నారు.. ఇప్పుడు 120 రూపాయలకు రెండు కిలోలు అంటున్నారు.. ఏంటి బాసూ వారం రోజుల్లోనే రేటు డబుల్ అయ్యిందా ఏంటీ.. ఇదీ హైదరాబాద్ సిటీలో సామాన్య ఫ్యామిలీ మ్యాన్ మాటలు.. కొంత కాలం క్రితం వరకు కిలోల లెక్కన అమ్మిన ఉల్లిపాయలు.. ఇప్పుడు వంద రూపాయల చొప్పున అమ్ముతున్నారు.

అంటే వందకు కిలో.. 2 కిలోలు.. 3 కిలోలు.. 4 కిలోలు.. 5 కిలోలు ఇలాంటి ట్రెండ్ వచ్చింది. క్రమంగా సిటీ జనం దీనికి అలవాటు పడిపోయారులేండీ.. 2026, ఆగస్ట్ 27వ తేదీ నాటికి హైదరాబాద్ సిటీలో కిలో ఉల్లి ఎంతో తెలుసా.. అక్షరాల 60 రూపాయలు.. 120 రూపాయలకు 2 కిలోలు అంటూ రోడ్ల పక్కన ఆటోలపై బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

ఈ ఏడాది ఉల్లి రైతుల నుంచి కొనుగోలు చేసిన 1.2 లక్షల టన్నుల ఉల్లిపాయలలో, సుమారు 30 శాతం ఇప్పటికే కుళ్లిపోవడం, మొలకలు రావడం వల్ల పాడైపోయాయి. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వ బఫర్ స్టాక్ నుంచి 500 టన్నుల ఉల్లిపాయలను తీసుకువెళ్తున్న 'కాండా ఎక్స్‌ప్రెస్' ప్రత్యేక రైలు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు లాసల్‌గావ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. దీంతో.. ఉల్లిపాయల కొరతపై ఆందోళనలు పెరిగాయి. ఉల్లి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి నిల్వల్లో దాదాపు 30 శాతం కుళ్లిపోవడం ఒక కారణమైతే.. పరిస్థితి మరింత దిగజారడానికి మరో కారణం పంట కోత సమయంలో కురిసిన అకాల వర్షాలు.

ఈ వర్షాల వల్ల ఉల్లిపాయల క్వాలిటీ లేకుండా అయిపోయాయి. వర్షాల్లో తడవడం వల్ల.. నిల్వ సామర్థ్యం తగ్గి, ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కష్టమైంది. సాధారణంగా ప్రతి సంవత్సరం సుమారు 20 శాతం ఉల్లిపాయలు పాడైపోవడం ఎప్పడూ జరిగేదే. కానీ.. ఈ సంవత్సరం ఈ సంఖ్య 40 శాతానికి చేరే అవకాశం లేకపోలేదని వ్యాపారులు చెబుతున్నారు. ఖరీఫ్ పంట ఆలస్యం కావడం వల్ల సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉల్లిపాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.