మన స్టాక్ మార్కెట్లలో కూడా అమెరికా తరహా క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) ప్రవేశపెట్టిన తొలి నెలవారీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ రోజు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెబీ స్టాక్ మార్కెట్లలో ధరల మానిప్యులేషన్‌ను అరికట్టడానికి ఆగస్టు 3న ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఈ సరికొత్త సిస్టమ్ కారణంగా సెన్సెక్స్, సెన్సెక్స్ సూచీలు ఒక్కసారిగా విపరీతమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. కేవలం 5 నిమిషాల వ్యవధిలో జరిగిన ఊహించని మార్పులు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.
5 నిమిషాల్లో కోటీశ్వరుడిగా..
ఈ మార్కెట్ ఓలటాలిటీ సామాన్య ఇన్వెస్టర్లను భయపెట్టినప్పటికీ.. కొందరు స్మార్ట్ ఇన్వెస్టర్లకు మాత్రం కాసుల వర్షం కురిపించింది. మార్కెట్ ముగిసే సమయంలో జరిగిన వైల్డ్ స్వింగ్స్ వల్ల సోషల్ మీడియాలో ఒక ట్రేడర్ వేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఒకవేళ ఎవరైనా మధ్యాహ్నం 3.15 గంటలకు లక్ష రూపాయలతో 76,500 సెన్సెక్స్ పుట్ ఆప్షన్స్ కొనుగోలు చేసి.. సరిగ్గా 3.20 గంటలకు వాటిని అమ్మేస్తే కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే లాభం ఏకంగా 44 లక్షల రూపాయలకు చేరుకునేదని ట్రేడర్లు లెక్కలుగట్టారు. ఈ అసాధారణ మార్కెట్ హెచ్చుతగ్గులు ట్రేడింగ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సెన్సెక్స్‌లో 2200 పాయింట్ల భారీ క్రాష్, మళ్లీ రికవరీ
గురువారం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో CAS ప్రారంభమైన 5 నిమిషాల విండోలో అంటే మధ్యాహ్నం 3.18 నుండి 3.23 గంటల మధ్య సెన్సెక్స్ ఏకంగా 2వేల 200 పాయింట్ల మేర కుప్పకూలింది. ఆ వెంటనే తర్వాతి 7 నిమిషాల్లో అంటే 3.23 నుండి 3.30 గంటల మధ్య దాదాపు 2వేల పాయింట్లు తిరిగి రికవరీ కావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరికి సెన్సెక్స్ బుధవారం ముగింపుతో పోలిస్తే 539 పాయింట్లు నష్టపోయి 76,934 వద్ద ముగిసింది. ఈ కొన్ని నిమిషాల మధ్య జరిగిన వైల్డ్ ట్రేడింగ్ కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ వంటి దిగ్గజ షేర్లు కూడా నిమిషాల వ్యవధిలో 3 శాతం వరకు పడిపోయి.. అంతే వేగంగా కోలుకోవడం మార్కెట్ వర్గాలను విస్మయపరిచింది. ఎన్‌ఈఎస్‌లో నిఫ్టీ కూడా స్వల్ప హెచ్చుతగ్గులను చవిచూసినప్పటికీ, బీఎస్‌ఈలో కనిపించినంత తీవ్రత లేదు.
ట్రేడర్ల మండిపాటు..
కొత్త CAS విధానం వల్ల కొద్దిమంది భారీ లాభాలు గడించినప్పటికీ.. మెజారిటీ ట్రేడర్లు మాత్రం మార్కెట్ నిబంధనలపై పెదవి విరుస్తున్నారు. ఈ అకస్మాతు ధరల మార్పుల వల్ల సాధారణ ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు అంచనాలకు అందకుండా కేవలం నిమిషాల వ్యవధిలో సూచీలు ఈ స్థాయిలో ఊగిసలాడటం ట్రేడింగ్ పద్ధతులపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
మార్కెట్ మానిప్యులేషన్ జరుగుతోందా..
ఈ ఘటనకు సరిగ్గా ఒక వారం ముందు.. జేపీ మోర్గాన్ సంస్థకు చెందిన కోప్‌థాల్ మారిషస్ సంస్థ సెన్సెక్స్ సూచీ అలాగే అందులోని లిస్టెడ్ షేర్లను తారుమారు చేసి దాదాపు రూ.3 కోట్ల అక్రమ లాభాలు ఆర్జించినట్లు సెబీ గుర్తించింది. మన్సీ స్టాక్ అండ్ షేర్ బ్రోకింగ్ సంస్థ కూడా ఇలాంటి అక్రమాలకే పాల్పడినట్లు నిర్ధారించి.. ఆ సంస్థలపై మార్కెట్ నియంత్రణ సంస్థ నిషేధం విధించింది. దీంతో కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్ వల్ల వస్తున్న ఓలటాలిటీ చిన్న ఇన్వెస్టర్లకు మరింత ఆందోళన కలిగిస్తోంది.
CAS విధానం ఏంటీ..?
స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ముగిసే సమయమైన సాయంత్రం 3:15 నుండి 3:30 గంటల మధ్య షేర్ల ముగింపు ధరలను పారదర్శకంగా నిర్ణయించడానికి సెబీ ప్రవేశపెట్టిన సరికొత్త విధానమే క్లోజింగ్ ఆక్షన్ సెషన్(CAS). అభివృద్ధి చెందిన దేశాల్లోని స్టాక్ మార్కెట్ల ప్రేరణతో తెచ్చిన ఈ విధానం ద్వారా.. చివరి నిమిషాల్లో జరిగే ధరల మానిప్యులేషన్‌ను అరికట్టవచ్చు. డెరివేటివ్స్ ట్రేడింగ్ జరిగే సుమారు 200 స్టాక్స్‌కు ఇది వర్తిస్తుంది. ఈ సమయంలో అన్ని కొనుగోలు, అమ్మకాల ఆర్డర్లను సేకరించి.. డిమాండ్ సప్లై ఆధారంగా ముగింపు ధరగా ప్రకటిస్తారు.
