న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ బుక్ ప్రచురణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ బుక్ పబ్లిషింగ్ నుంచి ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా తప్పుకుంది. ఈ మేరకు శుక్రవారం (ఆగస్ట్ 28) సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. సోనియా గాంధీతో ఏర్పడిన ఎడిటోరియల్ అభిప్రాయభేదాల వల్లే పెంగ్విన్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పేరుతో సోనియా గాంధీ తన ఆత్మకథ రాసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత విషయాలపై బహిరంగంగా ఎక్కడ మాట్లాడని సోనియా ఈ పుస్తకంలో ఆమె వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీతో ప్రేమ, పెళ్లి.. రాజీవ్ గాంధీ హత్యా.. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ, వ్యక్తిగత విషయాలను ఈ పుస్తకంలో ఆమె రాశారు. దీంతో సోనియా ఆత్మకథపై తీవ్ర ఆసక్తి నెలకొంది. 2026, నవంబర్‌లో ఈ పుస్తకం విడుదల అవుతుందని ప్రకటించారు. ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఈ పుస్తకాన్ని ముద్రించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
మరికొన్ని రోజుల్లో పుస్తకం విడుదల కావాల్సిన నేపథ్యంలో భారత్‌లో ఈ బుక్ పబ్లిషింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు పెంగ్విన్ ఇండియా ప్రకటించింది. పుస్తకంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని రచయిత్రి సోనియాను పెంగ్విన్ ఇండియా కోరినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకు సోనియా గాంధీ ఒప్పుకోలేదని.. తన పుస్తకంలో ఎలాంటి మార్పులు లేదా తొలగింపులు చేయడానికి ఆమె నిరాకరించినట్లు సమాచారం. రచయిత్రితో ఏర్పడిన ఎడిటోరియల్ అభిప్రాయభేదాల వల్లే పెంగ్విన్ ఇండియా బిలాంగింగ్ బుక్ ప్రచురణ నుంచి తప్పుకున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది.
పెంగ్విన్ ఇండియా క్లారిటీ:
సోనియా గాంధీ బిలాంగింగ్ బుక్ ప్రచురణ నుంచి తప్పుకోవడంపై పెంగ్విన్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. ఈ బుక్ పబ్లిషర్స్ తాము కాదని అధికారికంగా ప్రకటించిన సదరు కంపెనీ.. సోనియాతో ఎడిటోరియల్ అభిప్రాయభేదాల వల్లే ప్రచురణ నుంచి తప్పుకున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించింది. మాన్యుస్క్రిప్ట్‌లలోని (హస్తప్రతులు) సమాచారం నిజమా కాదా అని సరిచూడడం ప్రచురణలో ఒక సాధారణ భాగమని పేర్కొంది.
పుస్తకం నాణ్యతను పెంచడానికి ఎడిటర్లు పలు సూచనలు చేస్తారని స్పష్టం చేసింది. రచయితల పుస్తకాలకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చేలా వాస్తవాలను తనిఖీ చేయడం తమ బాధ్యత అని తెలిపింది. కాగా, పెంగ్విన్ ఇండియా తప్పుకోవడంతో ఇండియాలో ఈ పుస్తకాన్ని ప్రచురించి పంపిణీ చేయడానికి ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ హార్పర్‌కాలిన్స్ ఇండియా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
