అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం 179 ఏళ్ల వెయిటింగ్.. క్యూలో 79% మంది భారతీయులే: షాకింగ్ రిపోర్ట్

అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం 179 ఏళ్ల వెయిటింగ్.. క్యూలో 79% మంది భారతీయులే: షాకింగ్ రిపోర్ట్

అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాలంటే ఏకంగా 179 సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తే ఎలా ఉంటుంది? వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో నెలకొన్న దారుణమైన పరిస్థితుల వల్ల ఇది అక్షరాల నిజంగా మారింది. అవును అమెరికాలో శాశ్వత నివాసం కోసం అందించే గ్రీన్ కార్డ్ పొందాలని ఆశపడే లక్షలాది మంది భారతీయులకు అక్కడి విధానాలు ఒక అంతులేని పీడకలగా మారాయి. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ విడుదల చేసిన లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది.

భారతీయులపైనే అత్యధిక ప్రభావం..
అమెరికా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్న మొత్తం దరఖాస్తుదారుల్లో దాదాపు 79 శాతం మంది కేవలం భారతీయులే కావడం గమనార్హం. డిసెంబర్ 2025 నాటికి.. కేవలం EB-2 కేటగిరీలోనే 7లక్షల 31వేల 566 మంది భారతీయులు నిరీక్షిస్తున్నారు. అలాగే EB-3 కేటగిరీలో 2లక్షల 13వేల 414 మంది, EB-1 కేటగిరీలో 51వేల 619 మంది ఉన్నారు. ఈ 3 ప్రధాన కేటగిరీలను కలుపుకుంటే మొత్తం బ్యాక్‌లాగ్ దాదాపు 9లక్షల 96వేల 599కి చేరింది.

179 సంవత్సరాల నిరీక్షణ..
ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేసుకునే ప్రొఫెషనల్స్ వేచి ఉండే కాలం ఊహకందనంత ఎక్కువగా ఉంది. జనవరి 2026 తర్వాత EB-2 కేటగిరీలో దరఖాస్తు చేసుకునే భారతీయ జాతీయత కలిగిన నిపుణులు గ్రీన్ కార్డ్ పొందడానికి ఏకంగా 179 సంవత్సరాలు పడుతుందని అంచనా వేశారు. ఇక EB-3 కేటగిరీలో ఈ వెయిటింగ్ పీరియడ్ 38 సంవత్సరాలుగా ఉంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. 2040 నాటికి ఈ క్యూ 20 లక్షలకు పైగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వెయిటింగ్ లిస్టులో ఉన్నోళ్లలో 79 శాతం మంది భారతీయులేనని రిపోర్ట్ పేర్కొంది.

చట్టపరమైన పరిమితులే అసలు సమస్య..
ఈ భారీ జాప్యానికి కాంగ్రెస్ విధించిన పాత నిబంధనలే ప్రధాన కారణం. 1990లో నిర్దేశించిన వార్షిక కోటా ప్రకారం ఉద్యోగ ఆధారిత వీసాల సంఖ్య కేవలం లక్షా 40వేలు మాత్రమే. దీనికి తోడు సెక్షన్ 202(a) ప్రకారం విధించిన 7 శాతం దేశాలవారీ పరిమితి భారత్, చైనా వంటి దేశాల నిపుణులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ వద్ద పెండింగ్‌లో ఉన్న పీఈఆర్ఎం ప్రాసెసింగ్ సమయం కూడా వందలాది రోజులు పడుతుండటంతో సమస్య మరింత జటిలమవుతోంది.

శాశ్వత పరిష్కారం అవసరం..
ఈ విపత్కర పరిస్థితులు కేవలం నిపుణులకే కాకుండా.. అమెరికన్ కంపెనీలకు కూడా ప్రతిభావంతులను నిలుపుకోవడంలో పెద్ద సవాల్‌గా మారుతున్నాయి. కేవలం పరిపాలనాపరమైన సర్దుబాట్లతో ఈ సమస్య పరిష్కారం కాదని, చట్టసభలు జోక్యం చేసుకుని వీసా కోటాలను పెంచడంతో పాటు దేశాలవారీ నిబంధనలను తొలగిస్తేనే భారతీయ టెక్కీలకు నిజమైన ఊరట లభిస్తుంది.