ఒక్క కోడి గుడ్డు 14 రూపాయలు అవుతుందా : E20 పెట్రోల్‌తో ఉన్న లింకేంటీ..?

ఒక్క కోడి గుడ్డు 14 రూపాయలు అవుతుందా : E20 పెట్రోల్‌తో ఉన్న లింకేంటీ..?

దేశంలోని సామాన్యులకు అత్యంత చవకైన ప్రొటీన్ సోర్స్ ఫుడ్ అయిన కోడిగుడ్డు రేట్లు జనం  జేబుకు చిల్లు పెడుతున్నాయి. గత ఏడాది కాలంలో గుడ్ల ధరలు ఏకంగా 40 శాతం వరకు పెరిగాయి. ఫారమ్ వద్ద గుడ్డు ధర రూ.7 వరకు పలుకుతుండగా.. ఆన్‌లైన్ డెలివరీ యాప్స్‌లో రిటైల్ ధర రూ.14కి చేరుకుంది. ఈ నేపథ్యంలో కేవలం సామాన్యులే కాకుండా ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా హై-ప్రొటీన్ ఫుడ్ ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సాధారణ కుటుంబానికి రోజువారీ ప్రొటీన్ అవసరాలు తీర్చుకోవడం భారంగా మారుతోంది.

అసలు కారణం మొక్కజొన్నే..
గుడ్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం మొక్కజొన్న ధరలు విపరీతంగా పెరగడమే. కోడిపెట్టల ఆరోగ్యానికి, గుడ్ల ఉత్పత్తికి అందించే దాణాలో మొక్కజొన్న ప్రధానమైన భాగం. దాదాపు 50 నుంచి 55 శాతం వరకు మొక్కజొన్నను కోళ్ల దాణా తయారీలో ఉపయోగిస్తారు. సోయాబీన్‌తో పాటు ఈ మొక్కజొన్నే కోళ్ల దాణా ఖర్చును నిర్ణయిస్తుంది. దాణా ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా కోడిగుడ్లు, చికెన్ ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఇదే సమస్య పౌల్ట్రీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది.

ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రభావం..
మోడీ ప్రభుత్వం తెచ్చిన ఇథనాల్ బ్లెండెడ్ E20 పెట్రోల్ కార్యక్రమం ఈ సంక్షోభానికి అసలు మూలం. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం కోసం ప్రభుత్వం మొక్కజొన్నను భారీ ఎత్తున మళ్లిస్తోంది. ఒకప్పుడు కోళ్ల దాణా కోసం, ఎగుమతుల కోసం అందుబాటులో ఉన్న మొక్కజొన్న ఇప్పుడు ఇథనాల్ డిస్టిలరీలకు తరలిపోతోంది. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం మొక్కజొన్న వినియోగం 8.3 లక్షల టన్నుల నుంచి ఏకంగా 125 లక్షల టన్నులకు పెరిగిపోయింది.

ఎగుమతుల నుంచి దిగుమతుల స్థాయికి..
మన దేశంలో మొక్కజొన్న ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా డిమాండ్ కూడా విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు భారత్ పెద్ద ఎత్తున మొక్కజొన్నను విదేశాలకు ఎగుమతి చేసేది. కానీ ఇథనాల్, కోళ్ల దాణా, స్టార్చ్ వంటి వివిధ పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో ఎగుమతులు తగ్గిపోయి.. దిగుమతులు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల దేశీయ మార్కెట్‌లో మొక్కజొన్న కొరత ఏర్పడి ధరలు అడ్డగోలుగా పెరిగాయి. కోడిగుడ్డు ఉత్పత్తి ఖర్చులో 65 నుండి 75 శాతం కేవలం దాణాకే ఖర్చవుతుంది కాబట్టి.. ముడిసరుకు ధరలు పెరిగితే ఆ భారం నేరుగా వినియోగదారులపై పడుతోంది.

రానున్న రోజుల్లో గుడ్ల రేట్లు పెరుగుతాయ్..
భారతదేశంలో శీతాకాలం వచ్చిందంటే చాలు గుడ్లకు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. ఇళ్లలో, హోటళ్లలో, రెస్టారెంట్లలో గుడ్ల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే 40 శాతం పెరిగిన ధరలు, వింటర సీజన్ డిమాండ్ కారణంగా రాబోయే నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఇథనాల్ ఒక్కటే కారణం కాకపోయినా.. ప్రభుత్వ విధానాల వల్ల మొక్కజొన్న రాకపోకల్లో వచ్చిన మార్పులే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.