మళ్లీ వరదలు వస్తున్నాయి వెళ్లిపోండి : పోలీస్ హెచ్చరికలతో జనం పరుగులు

 మళ్లీ వరదలు వస్తున్నాయి వెళ్లిపోండి : పోలీస్ హెచ్చరికలతో జనం పరుగులు

 నేపాల్ దేశంలో మళ్లీ కలకలం. అల్లకల్లోలం. నువాకోట్, రసువా నదులకు మళ్లీ వరదలు వస్తున్నాయని.. నదులకు సమీపంలో ఉండే అందరూ దూరంగా వెళ్లిపోవాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లోని జనం దూర ప్రాంతాలకు, ఎత్తైన కొండలపైకి పరుగులు పెడుతున్నారు. నువాకోట్, రసువా నదులకు దగ్గరగా ఉండే బిదుర్ మున్సిపాలిటీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. బిదుర్ మున్సిపాలిటీ పరిధిలో ఉండే జనం.. పోలీస్ హెచ్చరికల తర్వాత నదులకు దూరంగా వెళ్లిపోతున్నారు. 

నువాకోట్, రసువా, ధాండింగ్ జిల్లాలు నదులకు సమీపంలో ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో.. నదులకు సమీపంలోనే ఉన్నాయి ఇళ్లు. మళ్లీ భారీ వరదలు.. అది కూడా తీవ్రంగా రావొచ్చన్న వార్నింగ్స్ తో.. ఆయా ప్రాంతాల్లోని జనం ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. నదులు, వాగులు, వంకలకు సమీపంలో ఉండే వాళ్లు సైతం అప్రమత్తంగా ఉండాలని.. ఎవరూ ఇళ్లల్లో ఉండొద్దని.. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

టిబెట్ అవతల చైనా వైపు ఉన్న సరస్సుల కట్ట తెగిందని.. భారీ వరదలు రాబోతున్నాయని.. వీలైంత త్వరగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ పోలీసులు, అధికారులు హెచ్చరిస్తుండటంతో.. జనంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి వరదలు పోటెత్తుతాయో అనే భయం ఇప్పుడు నేపాల్ జనంలో నెలకొంది.