ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై.. హైదారాబాద్ లో  బీటెక్ విద్యార్థి మిస్సింగ్

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై.. హైదారాబాద్ లో  బీటెక్ విద్యార్థి మిస్సింగ్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారి, లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఓ బీటెక్ విద్యార్థి అనుమానాస్పద రీతిలో అదృశ్యమయ్యాడు.

 రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యోగినంద.. జేబీఐటీ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. గతంలోనూ ఆన్‌లైన్ గేమ్స్ ఆడి యోగినంద సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతూ తెలిపారు. కొద్ది నెలల క్రితం తల్లి జీతానికి సంబంధించిన రూ.24 వేలు తీసుకోగా, తల్లిదండ్రులు మందలించడంతో అందులో రూ.10 వేలు తిరిగి ఇచ్చాడు.

ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి రూ.8 వేల నగదు తీసుకుని తన హోండా షైన్ బైక్‌పై బయటకు వెళ్లిన యోగినంద తిరిగి ఇంటికి రాలేదు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఫలితం లేకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.తమ కుమారుడు ఏ పరిస్థితిలో ఉన్నాడోనని, క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.