ఇమ్రాన్ ఖాన్ కొడుకుల ఇంటర్వ్యూతో పాక్ ఓవరాక్షన్.. లార్డ్స్ టెస్టు ఆపేస్తామని బిల్డప్!

ఇమ్రాన్ ఖాన్ కొడుకుల ఇంటర్వ్యూతో పాక్ ఓవరాక్షన్.. లార్డ్స్ టెస్టు ఆపేస్తామని బిల్డప్!

PCB Threatens to Boycott Lord’s Test: లండన్‌లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ సందర్భంగా ఊహించని వివాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిమ్, సులైమాన్ ఖాన్‌లతో చేసిన ఇంటర్వ్యూను అధికారిక ప్రసారకర్త స్కై స్పోర్ట్స్ ప్రసారం చేయడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మ్యాచ్ తొలి రోజున ఈ రాజకీయ అంశాలతో కూడిన ఇంటర్వ్యూను ప్రసారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీబీ, తమ ఆటగాళ్లను మైదానంలోకి పంపకుండా మ్యాచ్‌ను బహిష్కరిస్తామని (బాయ్‌కాట్) హెచ్చరించింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.. 

ఇంటర్వ్యూపై పీసీబీ అభ్యంతరం ఎందుకు?: 

స్కై స్పోర్ట్స్ బుధవారం లార్డ్స్ మైదానంలో ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిమ్, సులైమాన్ ఖాన్‌లను ఇంటర్వ్యూ చేసింది. జైలులో ఉన్న తమ తండ్రి ఆరోగ్యం, దెబ్బతింటున్న ఆయన కంటిచూపు గురించి వారు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ప్రత్యక్షంగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ కవరేజ్‌లో రాజకీయ అంశాలను చేర్చడంపై పీసీబీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. స్కై స్పోర్ట్స్ ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేస్తే, మధ్యాహ్నం సెషన్‌లో పాకిస్తాన్ ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉండిపోతారు, మైదానంలోకి రారని పాక్ బోర్డు హెచ్చరించినట్లు తెలుస్తుంది. 

పాకిస్తాన్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిందా?:

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించినప్పటికీ, చివరికి లార్డ్స్ టెస్ట్ మధ్యాహ్నం సెషన్‌ను బహిష్కరించలేదు.. స్కై స్పోర్ట్స్ ఈ ఇంటర్వ్యూ ప్రసారాన్ని కాస్త ఆలస్యం చేసి, లంచ్ విరామం సమయంలో ప్రసారం చేసింది. ఆ తర్వాత పాక్ ప్లేయర్స్ లంచ్ బ్రేక్ తర్వాత యథావిధిగా మైదానంలోకి వచ్చారు. ఈ ఘటనపై పీసీబీ స్కై స్పోర్ట్స్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి కూడా ఈ వివాదం గురించి తెలియజేసినట్లు సమాచారం.

ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఏం చెప్పారంటే:

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ చేసిన ఈ ఇంటర్వ్యూలో కాసిమ్, సులైమాన్ ఖాన్‌లు జైలులో ఉన్న తమ తండ్రి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఉన్న పరిస్థితులపై కాసిమ్ మాట్లాడుతూ.. అక్కడి అధికారులు ఏం చేస్తున్నారో స్పష్టంగా తెలియడం లేదు.. జైలులోనే ఇమ్రాన్ ను చంపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతడ్ని వీలైనంత ఎక్కువ కాలం జైలులోనే ఉంచి, నోరు మూయించాలని చూస్తున్నారని ఆరోపించారు.

ALSO READ : మా ఫోకస్ క్రికెట్‌పైనే.. హ్యాండ్‌షేక్‌ కాదు

ఇమ్రాన్ ఖాన్ జైలులో ఎందుకు ఉన్నారు?: 

73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌ను అవినీతి ఆరోపణల కేసుల్లో 2023 ఆగస్టులో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఒక కేసులో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఇమ్రాన్, ఇవన్నీ రాజకీయం ప్రేరేపితమైన కేసులని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని అడియాలా జైలులో ఖైదుగా ఉన్నారు. ఇప్పటికే ఆయన మూడేళ్లకు పైగా జైలు జీవితం గడిపారు.