ఆగస్టు 30న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... ఈ రూట్లో వెళ్లేటోళ్ళు బీ అలర్ట్..!

ఆగస్టు 30న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... ఈ రూట్లో వెళ్లేటోళ్ళు బీ అలర్ట్..!

NMDC 14వ మారథాన్ సందర్భంగా ఆదివారం ( ఆగస్టు 30 ) హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ సిటీ నుంచి సైబరాబాద్ లోని పలు మార్గాల్లో ఈ డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు పోలీసులు. ఫుల్ మారథాన్ (42.195 కి.మీ.), హాఫ్ మారథాన్ (21.097 కి.మీ.) మరియు 10 కి.మీ. కేటగిరీలలో జరిగే ఈ మారథాన్ ఆదివారం ఉదయం 5 గంటల నుండి 11:30 గంటల మధ్య నిర్వహించబడుతుంది. 

ఫుల్, హాఫ్ మారథాన్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుండి ప్రారంభమవుతాయి, 10 కిలోమీటర్ల మారథాన్ మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్ దగ్గర మొదలవుతుంది. మారథాన్ జరిగే మూడు రూట్లు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం దగ్గర కలుస్తాయని తెలిపారు పోలీసులు.

జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ రూట్లలో మారథాన్:

  • ఫుల్, హాఫ్ మారథాన్ మార్గాలు పీపుల్స్ ప్లాజా నుండి జూబ్లీ హిల్స్ మీదుగా, రోడ్ నెం 45 ద్వారా సైబరాబాద్ పరిధిలోకి ప్రవేశించి, స్టేడియంకు వెళ్లే మార్గంలో కేబుల్ బ్రిడ్జ్, ఐటిసి కోహినూర్, మైండ్‌స్పేస్, బయో-డైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఐఐఐటి జంక్షన్‌లను దాటుతాయి. 
  • 10 కిలోమీటర్ల మారథాన్ హైటెక్స్ దగ్గర ప్రారంభమై, NAC మెయిన్ గేట్, CII జంక్షన్, టెక్ మహీంద్రా, బయో-డైవర్సిటీ జంక్షన్ గుండా ప్రయాణించి, గేట్ నెం 1 ద్వారా స్టేడియంలోకి వెళ్లి కలుస్తుంది.

భారీ వాహనాలకు నిషేధం, క్యాబ్ పికప్‌లపై ఆంక్షలు:

మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కొల్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఈవెంట్ మార్గాలలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, రెడీ-మిక్స్ కాంక్రీట్ క్యారియర్లు, వాటర్ ట్యాంకర్లతో సహా భారీ వాహనాలను అనుమతించరు. ఈ సమయంలో నిషేధిత ప్రాంతాలలో పికప్‌లు, డ్రాప్-ఆఫ్‌లను నివారించాలని క్యాబ్, ఆటో, టాక్సీ అగ్రిగేటర్ కంపెనీలను సూచించారు అధికారులు.

  • షేక్‌పేట్ ఫ్లైఓవర్ నుండి లింగంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఖజాగూడ జంక్షన్, నానక్‌రామ్‌గూడ, గోపన్‌పల్లి మీదుగా మళ్లిస్తారు 
  • లింగంపల్లి నుండి మెహదీపట్నం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను మసీద్‌బండ టి-జంక్షన్ వద్ద బొటానికల్ గార్డెన్, అంజయ్య నగర్, ఔటర్ రింగ్ రోడ్  మీదుగా మళ్లించి తిరిగి ఖజాగూడ జంక్షన్‌కు చేర్చుతారు 
  • కొండాపూర్, కొత్తగూడ నుండి సైబర్ టవర్స్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అంజయ్య నగర్, రోలింగ్ హిల్స్ మరియు దుర్గం చెరువు మీదుగా దారి మళ్లిస్తారు