పశ్చిమ బెంగాల్ ఓటర్ల వివాదం: 1.15 కోట్ల ఓట్లు గల్లంతు.. సుప్రీంకోర్టు సీరియస్.. కేవలం 2 శాతమే పరిష్కారం!

 పశ్చిమ బెంగాల్ ఓటర్ల వివాదం: 1.15 కోట్ల ఓట్లు గల్లంతు.. సుప్రీంకోర్టు సీరియస్.. కేవలం 2 శాతమే పరిష్కారం!

 పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనే ప్రత్యేక ఓటర్ల లిస్ట్  సవరణ ప్రక్రియ జరిగింది. దింతో  రాష్ట్రంలో కోట్ల మంది ఓట్లు తొలగిపోయాయి. లిస్ట్  నుంచి తమ పేర్లు తొలగించారంటూ బాధితులు దాఖలు చేసిన అప్పీళ్లలో ఇప్పటివరకు కేవలం 2 శాతం మాత్రమే పరిష్కారం అయ్యాయి. మిగతావన్నీ అలాగే పెండింగ్‌లో పడ్డాయి.
 
2024లో పశ్చిమ బెంగాల్‌లో 7.60 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 6.44 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 1.15 కోట్ల మంది (15% పైగా) ఓటర్లు లిస్ట్ నుంచి తొలగిపోయారు. కోల్‌కతా సౌత్, మాల్దా జిల్లాల్లో దాదాపు 30 శాతానికి పైగా ఓట్లు తగ్గిపోయాయి. ముర్షిదాబాద్, నార్త్ 24 పార్గణాస్  వంటి జిల్లాల్లో సంఖ్యాపరంగా అత్యధిక ఓట్లు కోల్పోయారు.

  ఓటర్ల లిస్టులో తమ పేర్లు మళ్లీ చేర్చాలని కోరుతూ ప్రజలు దాఖలు చేసిన దాదాపు 38 లక్షల అప్పీళ్లు ట్రిబ్యునళ్లలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆగస్టు 7 నాటికి కేవలం 82,782 (సుమారు 2%) అప్పీళ్లను మాత్రమే విచారించారు.

 ట్రిబ్యునల్ పరిష్కరించిన వాటిలో 75,443 కేసుల్లో ఓటర్లకు అనుకూలంగా తీర్పు వచ్చి వారి పేర్లను మళ్లీ లిస్టులో చేర్చారు. అంటే విచారణ జరిగిన వాటిలో దాదాపు 91 శాతం మందికి న్యాయం జరిగింది. కానీ విచారణ వేగం చాలా నెమ్మదిగా ఉంది. ప్రతి 46 అప్పీళ్లలో కేవలం ఒక్కదానిపై మాత్రమే తీర్పు వచ్చింది.

 తొలగించబడిన ఓట్లలో చాలా వరకు అప్పీళ్లు సామాన్య ప్రజల నుంచి కాకుండా, ఏకంగా ఎన్నికల సంఘం (ECI) అధికారుల నుంచే వచ్చాయి. అంటే అధికారులు చేర్చిన పేర్లను మళ్లీ ఎలక్షన్ కమిషనే సవాలు చేస్తూ అప్పీళ్లు వేసింది.

ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ వేగంతో విచారణ జరిగితే లక్షలాది మందికి అన్యాయం జరుగుతుందని భావించిన సుప్రీంకోర్టు (CJI సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం) దీనిపై తీవ్రంగా స్పందించింది. పెండింగ్‌లో ఉన్న అప్పీళ్ల వివరాలన్నింటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.