రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆగస్టు 27 గురువారం నుంచి ఆగస్టు 31 సోమవారం వరకు ఏకంగా 5 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
ఈసారి వరుస సెలవులు ఆగస్టు 26న మిలాద్-ఉన్-నబీ, ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి, ఆగస్టు 30న ఆదివారం సెలవు రావడంతో పండుగకు ముందే ప్రయాణికుల రద్దీ భారీగా ప్రారంభమైందని మంత్రి తెలిపారు. అలాగే తిరుగు ప్రయాణాల రద్దీ ఆగస్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆగస్టు 31 సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు.
గత ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా 4,760 ప్రత్యేక బస్సులను నడిపించగా... ఈ ఏడాది రద్దీకి అనుగుణంగా మరో 240 బస్సులను అదనంగా పెంచి మొత్తం 5,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది ఈ ప్రత్యేక బస్సుల ద్వారా సుమారు 3.68 కోట్ల మంది ప్రయాణించగా, అందులో ఏకంగా 2.51 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉండటం గమనార్హం.
మహిళా ప్రయాణికులకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. రద్దీ ఉన్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించామన్నారు. సొంతూళ్లకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు."
