ఆగస్టు నెల వచ్చింది పండగల సీజన్ మొదలైంది. మన దేశంలో పండుగలంటే ఏమున్నా లేకున్నా స్వీట్స్ మాత్రం తప్పనిసరి. దేవుడికి పెట్టే నైవేద్యం దగ్గర నుంచి ఇంట్లో చేసుకునే పిండి వంటల వరకు కచ్చితంగా స్వీట్స్ ఉండాల్సిందే. అయితే.. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మన నెత్తిన పిడుగుపడింది... చక్కెర ధర అమాంతం పెరిగింది. బ్రాండ్, రకాన్ని బట్టి హైదరాబాద్ లో కిలో చక్కెర రూ.65 నుండి రూ.80 వరకు ఉంది. ఆల్మోస్ట్ 40 శాతం పెరిగింది. మధ్యతరగతి మానవుడు పండగకి స్వీట్స్ చేసుకోవడం కూడా భారమే అయిపోయింది కదా...!
అదేముంది..! జెప్టో, బ్లింకిట్, బిగ్ బజార్ అంటూ బోలెడు క్విక్ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి.. వాటిలో ఆఫర్స్ ఉంటాయి అంటారా..? ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. ఆన్ లైన్లో కూడా మనకు నచ్చినంత క్వాంటిటీ చక్కెర కొనలేం. క్విక్ కామర్స్ కంపెనీలు కూడా చక్కెర అమ్మకాలపై పరిమితి విధించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఏ యాప్ లో ఎంత లిమిట్ అంటే..?
బ్లింకిట్: ఢిల్లీలో ఎంపిక చేసిన బ్రాండ్‌లపై ఒక్కో లావాదేవీకి 5 కేజీల వరకు లిమిట్.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్: రెండు 1-కిలో ప్యాకెట్లు లేదా ఒక 5-కిలో ప్యాకెట్
బిగ్‌బాస్కెట్: కొన్ని బ్రాండ్‌లకు 6 కేజీల వరకు
జెప్టో: స్టాక్‌ను బట్టి పలు ప్రాంతాల్లో పరిమిత అమ్మకాలు
ఈ పరిమితుల ముఖ్య ఉద్దేశ్యం, పెద్దమొత్తంలో కొనుగోళ్లను నివారించడం, ఇతర వినియోగదారులకు తగినంత సరుకు అందుబాటులో ఉండేలా చూడటం కోసమే అని చెబుతున్నారు నిపుణులు.
డిమార్ట్, రిలయన్స్ లో ఇలా:
ఈ ఆంక్షలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకే పరిమితం కాలేదు. డిమార్ట్, రిలయన్స్ రిటైల్ వంటి ప్రధాన రిటైల్ సంస్థలు కూడా ఒక్కో కస్టమర్ కి చక్కెర కొనుగోళ్లను సుమారు 2 నుండి 3 కిలోలకు పరిమితం చేశాయి. ప్యానిక్ బయ్యింగ్ ని అరికట్టి స్టాక్ అందరికి అందుబాటులో ఉండేలా చూడటమే ఈ లిమిట్ లక్ష్యమని చెబుతున్నారు సిబ్బంది. అయితే, దేశంలో ఎలాంటి చక్కెర కొరత లేదని అంటున్నారు.
చక్కెర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
చక్కెర ధర పెరుగుదలకు మూడు ప్రధాన కారణాలున్నాయి:
ఉత్పత్తి తగ్గుతుందని అంచనా:
పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత, 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి భారతదేశ నికర చక్కెర ఉత్పత్తి సుమారు 279 లక్షల టన్నులుగా ఉంటుందని ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) అంచనా వేసింది.
అధిక డిమాండ్:
ఇండియాలో ఏటా సుమారు 280 నుంచి 285 లక్షల టన్నుల చక్కెర వినియోగంలో ఉంది. ఈ సీజన్లో దాదాపు 50 లక్షల టన్నుల ప్రారంభ నిల్వతో మొదలైనప్పటికీ ఉత్పత్తి తగ్గుతుందనే ఆందోళన సప్లై పై ప్రభావం చూపింది.
క్లోజింగ్ స్టాక్ పడిపోయే ఛాన్స్:
సెప్టెంబర్ చివరి నాటికి ఇండియాలో చక్కెర నిల్వలు సుమారు 35 లక్షల టన్నులకు పడిపోవచ్చని, ఇది గతం కంటే తక్కువని ISMA అంచనా వేస్తోంది.
ఒక నెలలో చక్కెర ధర ఎంత పెరిగింది?
జూలై 26న కిలో రూ.48
ఆగస్టు 20న కిలో రూ.55.70
ఆగస్టు 26న కిలో రూ.65.05
కేవలం ఒక నెలలోనే సగటున సుమారు 35.5శాతం పెరిగింది.
