Shubman Gill: కొలంబో టెస్టులో శ్రీలంకకు ఫాలో-ఆన్ ఇచ్చి 2–0 తేడాతో సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసేద్దామని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెగ సంబరపడిపోయాడు. తీరా చూస్తే ఆ లంక బ్యాటర్లు, ముఖ్యంగా సోనాల్ దినూషా అడుగోడలా నిలబడి ఇండియన్ బౌలర్లకు చుక్కలు చూపించి మ్యాచ్‌ను కాస్త డ్రా చేసేశారు. ఇక మ్యాచ్ ముగిశాక మైకు ముందట నిలబడి కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. అబ్బే పిచ్ బాగా స్లో అయిపోయింది, బంతి అసలే సహకరించలేదు, బ్యాటర్లను బౌల్డ్ చేయడం గానీ ఎల్‌బీడబ్ల్యూ చేయడం గానీ అసలే కుదరలేదంటూ పిచ్ మీదికి తోసేసి కొత్త ఫిలాసఫీలు చెప్పారు. పోనీ ఫాలో-ఆన్ ఇవ్వడం వల్లే కదా ఈ తిప్పలంతా అంటే.. అబ్బే మా ప్లాన్ ఏం బెడిసికొట్టలేదు, ఏమో వర్షం వస్తుందేమోనన్న భయంతోనే ఆ రిస్క్ తీసుకున్నామని కలరింగ్ ఇచ్చాడు. కొలంబోలో మ్యాచ్ గెలవకపోయినా, డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు దిగజారిపోయినా.. మన కెప్టెన్ చెప్పిన ఈ సాకులు మాత్రం నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.
ఫాలో-ఆన్ ఇచ్చి తప్పు చేయలేదు.. వర్షం వస్తుందనే ఆ రిస్క్ చేశాం:
ఈ మ్యాచ్‌లో 213 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన తర్వాత శ్రీలంకకు ఫాలో-ఆన్ ఇవ్వడంపై వస్తున్న విమర్శలను ఇండియన్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిప్పికొట్టాడు. తమ నిర్ణయం బెడిసికొట్టిందని తాము భావించడం లేదని తెలిపాడు. మ్యాచ్ ముగిసే సమయానికి వర్షం పడే సూచనలు ఉండటంతో, వీలైనంత త్వరగా ఫలితాన్ని తేల్చాలనే ఉద్దేశంతోనే ఫాలో-ఆన్ ఇచ్చామన్నాడు. ఒకవేళ మేము ఫాలో-ఆన్ ఇవ్వకుండా ఉండి, వర్షం పడి ఉంటే.. ఫాలో-ఆన్ ఎందుకు ఇవ్వలేదని మీరే ప్రశ్నించేవారు. విజయం సాధించలేకపోవడం నిరాశ పరిచినా, దాదాపు 250 ఓవర్లకు పైగా ఫీల్డింగ్ చేసి మా శాయశక్తులా ప్రయత్నించాం.. లంక బ్యాటర్లు అద్భుతమైన స్కిల్ ప్రదర్శించడంతో పాటు వారికి కాస్త అదృష్టం కూడా కలసివచ్చిందని గిల్ భయ్యా వివరించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలపై ఎఫెక్ట్:
ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో భారత్ గెలవాల్సిన 12 పాయింట్లకు గాను కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించి, కీలకమైన 8 పాయింట్లను కోల్పోయింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో టీమిండియా పాయింట్ల శాతంలో (PCT) పెద్దగా మార్పు రాలేదు. ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి తీరాల్సిన ఒత్తిడి పెరిగింది. రాబోయే రోజుల్లో న్యూజిలాండ్‌తో 2 టెస్టులు, ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఉండటంతో, గిల్ సేనకు ఇకపై ప్రతి మ్యాచ్ గెలవడం అత్యంత కీలకంగా మారింది.
