జాగ్రత్త ఒళ్లు దగ్గర పెట్టుకోండి..తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

జాగ్రత్త ఒళ్లు దగ్గర పెట్టుకోండి..తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతల జోలికొస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  వార్నింగ్ ఇచ్చారు. కొన్ని మీడియా సంస్థలు ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని, తనపై జరుగుతున్న తప్పుడు కథనాలను తీవ్రంగా ఖండించారు.

రాష్ట్రంలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మీడియా ఎక్కడుంది? ఎవరికి సపోర్ట్ చేశారో ప్రజలందరికీ బాగా తెలుసని గుర్తుచేశారు. నిఖార్సైన తెలంగాణ నేతలను ఆంధ్రా మీడియా అడ్డుకోలేదని, తనపై కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. నేను తలుచుకుంటే వంద ఛానళ్లు పెడతానని చెప్పారు.

తాను తెలంగాణ కోసం ఎంతో పోరాడానని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా స్పష్టంగా చెప్పానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని, ఉద్యమంలో గొంతుక వినిపించిన నేతల పట్ల మీడియా అనుసరిస్తున్న తీరు సరికాదని అన్నారు.

నిధుల విడుదల కోసమే తాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశానని, దీనిపై వస్తున్న ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆ భేటీలో తాను రాజకీయ పరిణామాలపై ఎలాంటి చర్చలూ జరపలేదన్నారు. చిన్నారెడ్డి, సుస్మిత అంశానికి సంబంధించిన విషయాలను పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని, ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన తేల్చిచెప్పారు.