KL Rahul: కొలంబో వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆఖరి రోజున అనూహ్య మలుపు తిరిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో 503/9 పరుగుల భారీ స్కోరు చేసి, లంకను 290 రన్స్‌కే ఆలౌట్ చేసిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా సునాయాస విజయం సాధిస్తుందని భావించారు. 213 పరుగుల ఆధిక్యంతో ప్రత్యర్థికి ఫాలో-ఆన్ ఇచ్చినా, శ్రీలంక లోయర్ ఆర్డర్ ఊహించని రీతిలో తిరగబడింది. 5వ రోజు లంచ్ బ్రేక్ సమయానికి లంక 2వ ఇన్నింగ్స్‌లో 329/6 స్కోరు సాధించి, ఏకంగా 116 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లి భారత విజయానికి అడ్డుగోడలా నిలిచింది.
డగౌట్‌లో గంభీర్ సైలెంట్.. మైదానంలో రాహుల్ పెప్ టాక్:
పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో లంక ఆటగాళ్లు వికెట్ ఇవ్వకుండా విసిగించడంతో భారత క్యాంప్‌లో తీవ్ర నిరాశ స్పష్టంగా కనిపించింది. మైదానంలో సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ సహచర ఆటగాళ్లలో జోష్ నింపేందుకు సుదీర్ఘంగా పెప్ టాక్ ఇస్తూ కనిపించగా, డగౌట్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కనిపించాడు. లంక బ్యాటర్ పసిందు సూరియబండార (92), కమిందు మెండిస్ (55) రాణించగా, ఆ తర్వాత సోనాల్ దినూషా, కేశర నువంత జంట 246 బంతుల్లో 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత బౌలర్ల ఓర్పును పరీక్షించారు.
78 ఏళ్ల నాటి రికార్డు సమం చేసిన దినూషా:
ఈ మ్యాచ్‌లో లంక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సోనాల్ దినూషా అద్భుత ప్రదర్శనతో ఒక అరుదైన ప్రపంచ రికార్డును సాధించాడు. భారత్‌పై ఆడిన తన మొదటి 4 టెస్టు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించి చరిత్రలో నిలిచాడు. అంతకుముందు 1948లో వెస్టిండీస్ లెజెండ్ ఎవర్టన్ వీక్స్ మాత్రమే ఈ ఘనత సాధించగా, దినూషా సుదీర్ఘ కాలం తర్వాత ఆ రికార్డును సమం చేయడం విశేషం.
ALSO READ : సగం క్రీడల్లో మనం ఆడటం లేదు: 2036 ఒలింపిక్సే టార్గెట్
ఫాలో-ఆన్ నిర్ణయం బెడిసికొట్టిందా?:
వాతావరణ సూచనలు, పిచ్ పరిస్థితిని బట్టి బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ సలహాతో భారత్ ఫాలో-ఆన్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నప్పటికీ, పిచ్ రాను రాను బ్యాటింగ్‌కు సహకరించడంతో ఆ ప్లాన్ బ్రేక్ అయింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2019లో ప్రారంభమైనప్పటి నుంచి భారత్ ఇప్పటి వరకు 5 సార్లు ఫాలో-ఆన్ ఇవ్వగా, విజయం సాధించలేకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
— crictalk (@crictalk7) August 27, 2026
