హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుల కారు అకస్మాత్తుగా అదుపుతప్పి పల్టీలు కొడుతూ నీళ్లు లేని బావిలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏలూరి రాధమ్మ (70) అనే వృద్ధురాలు.. బావిలో కారు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొని, వీరంతా తిరిగి కారులో తమ స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న రవీందర్ రెడ్డి, వీరారెడ్డి, కిరణ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై.. తాడు సహాయంతో బావిలోకి దిగి క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా వారిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
