సగం క్రీడల్లో మనం ఆడటం లేదు: 2036 ఒలింపిక్సే టార్గెట్.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

సగం క్రీడల్లో మనం ఆడటం లేదు: 2036 ఒలింపిక్సే టార్గెట్.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

2036 Olympic Games: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ అథ్లెట్లను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ, భారత క్రీడారంగానికి సంబంధించి ఒక కీలకమైన చేదు నిజాన్ని బయటపెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్స్‌లో ఉండే మొత్తం పోటీలలో కనీసం సగం క్రీడల్లో కూడా భారత అథ్లెట్లు పాల్గొనడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక విభాగాల్లో మన ప్రాతినిధ్యమే లేకపోవడంతో పతకాల పట్టికలో భారత్ చాలా రకాల మెడల్స్ రేసుకు దూరమవుతోందని చెప్పారు. రాబోయే 2036 ఒలింపిక్స్ నాటికి ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి, పతకాల సంఖ్యను గణనీయంగా పెంచాలని పిలుపునిచ్చారు.

5 నుంచి 15 ఏళ్ల పిల్లలకు టాలెంట్ హంట్:

2036 ఒలింపిక్సే లక్ష్యంగా క్రీడా రంగాన్ని పరుగులు పెట్టించేందుకు గ్రాస్‌రూట్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించాడు. ఇందులో భాగంగానే 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లల కోసం దేశవ్యాప్తంగా భారీ టాలెంట్ హంట్ చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. కేవలం పిల్లలకు ఏ ఆటపై ఆసక్తి ఉందో చూడటమే కాకుండా, వారి శారీరక దారుఢ్యం, నైపుణ్యాలకు అనుగుణంగా ఏ క్రీడ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందో గుర్తించి దానికి తగినట్లుగా చిన్నప్పటి నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.

సర్ఫింగ్, క్లైంబింగ్.. భౌగోళిక అనుకూలతలను వాడాలి:

భారత్‌లో సుదీర్ఘమైన తీర ప్రాంతంతో పాటు భారీ పర్వత ప్రాంతాలు ఉన్నప్పటికీ, వాటర్ స్పోర్ట్స్ లేదా వింటర్ స్పోర్ట్స్‌లో మన దేశం గ్లోబల్ లెవెల్లో సరిగ్గా కనిపించకపోవడం ఆలోచించాల్సిన విషయమని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. సర్ఫింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్ లాంటి విభాగాలలో మన దేశ భౌగోళిక పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే ప్రతి జిల్లాలోని ప్రత్యేకతలకు అనుగుణంగా స్థానికంగా ఒక స్పెషల్ స్పోర్ట్స్ ఈకోసిస్టమ్ డెవలప్ చేసి, ఇప్పటి వరకు భారత్ అడుగుపెట్టని క్రీడల్లో కూడా పతకాల వేటను ప్రారంభించాలని సూచించారు.

ALSO READ : నేపాల్ వరదల్లో 288 భారతీయలు గల్లంతు

ప్రభుత్వం మీకు అడుగడుగునా తోడుగా ఉంటుంది:

భవిష్యత్తులో ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ సాధించి దేశానికి పతకాలు తేవాలనే లక్ష్యంతో శ్రమిస్తున్న యువ అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. కేవలం మైదానాల్లో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, అథ్లెట్లు క్వాలిఫై అయి పతకాలు సాధించేంత వరకు ప్రభుత్వం వారికి అడుగడుగునా తోడుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.